భూపాలపల్లి అర్బన్: జిల్లాలో 1,39,116 పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు అందేలా ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల మేరకు ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేపట్టాలని సూచించారు. జిల్లాస్థాయిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం అన్ని మండలాల్లో పంపిణీ ప్రక్రియ చేపట్టి, లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా కార్డుల పంపిణీని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


