మహాముత్తారం : మండలంలోని ములుగుపల్లి గ్రామంలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ మండపు లక్షిమల్లు ఇంటితోపాటు ఆయన కుమారులు ప్రభాకర్, మోహన్‌కు చెందిన ఇళ్లు సైతం కాలి బూడిదయ్యాయి. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు, పిల్లలు పాఠశాలకు వెళ్లడంతో ఇంట్లో ఎవరు లేరు. ఈ ప్రమాదం షార్ట్‌సర్క్యూట్‌తోనా లేక గ్యాస్‌సిలిండర్ పేలి జరిగిందా అనే కోణంలో బాధితులు ఆందోళన చెందుతున్నారు. మూడు గ్యాస్ సిలిండర్లు ఇంట్లో ఉండగా ఒక్క సిలిండర్ మాత్రం పేలి భారీ శబ్దం వచ్చినట్లు గ్రామస్తులు బాధితులకు, పోలీసులకు సమాచారం అందించారు. వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు చేరుకునే సరికి ఇళ్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. మూడు కుటుంబాలకు సంబంధించిన ఇంట్లోని వస్తువులతో పాటు రూ.3లక్షల 80వేల నగదు, వెండి, బంగారు ఆభరణాలు మంటల్లో కాలిపోయినట్లు అధికారులకు తెలిపారు. నగదుతోపాటు రూ.18లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు అధికారులకు వివరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ దండు శ్రీనివాస్, ఏఎస్సై దాట్ల కుమారస్వామి అగ్ని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సాయం కింద వారికి 75 కేజీల బియ్యం అందజేసి వారు ప్రస్తుతం నివాసం ఉండడానికి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేశారు.
ఈ అగ్ని ప్రమాదంలో నాతో పాటు ఇద్దరు కుమారుల ఇళ్లు పూర్తిగా కాలిపోవడంతో మూడు కుటుంబాలు సర్వం కోల్పోయాం. కట్టుబట్టలతో ఉన్నాం. ప్రభుత్వం వెంటనే సాయం అందించి ఆదుకోవాలి.
– మండపు లక్షిమల్లు, ములుగుపల్లి
మూడిళ్లు, నగదు, సామగ్రి అగ్గిపాలు
రూ.20 లక్షల ఆస్తి నష్టం


