● శ్రావణమాసంలో లక్షపత్రి పూజలు రద్దు
● ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, పాలకవర్గం
కాళేశ్వరం: ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్న శ్రావణమాసంలో ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నెలరోజుల పాటు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతున్నట్లు కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్‌శర్మ, ఈఓ మహేశ్ తెలిపారు. ఆదివారం కాళేశ్వరం ఈఓ కార్యాలయంలో చైర్మన్, ఈఓ, ధర్మకర్తలు, ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. పూజలు, భక్తుల రద్దీ, ఆలయ పరిసరాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.
లక్ష పత్రి పూజ రద్దు..
శ్రావణమాసంలో నిర్వహించే లక్ష బిల్వార్చన (లక్ష పత్రి పూజ)ను ఈ సారి రద్దు చేసినట్లు తెలిపారు. ఆదిముక్తేశ్వర స్వామి ఆలయ ప్రదేశం చిన్నగా ఉండటంతో భక్తులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున లక్షపత్రి పూజలను ఈ సంవత్సరం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భక్తులు దేవస్థానం సూచనలు పాటించాలని కోరారు. సరస్వతీ ఘాట్ వద్ద పూజలు నిర్వహించవద్దని నిర్ణయించామని, ప్రతీ రోజు ఉదయం 5.30గంటలకు మహాన్యాసక రుదాభ్రిషేక పూజలు నిర్వహించనున్నామని చెప్పారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు.
మాస శివరాత్రికి మహాలింగార్చన..
శ్రావణమాసంలో వచ్చే మాస శివరాత్రి సెప్టెంబర్ 9న మహాలింగార్చన పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
కూల్చివేత పనుల పరిశీలన..
సమావేశం అనంతరం చైర్మ న్, ఈఓ, ధర్మకర్తలు ఆలయంలో జరుగుతున్న కూల్చి వేత పనులను పరిశీలించారు. పునర్నిర్మాణంలో భాగంగా కొనసాగుతున్న పనుల పురోగతిని సమీక్షించి, పనులు సురక్షితంగా, నాణ్యతా ప్రమాణాలు పా టించాలని సూచించారు. సమావేశంలో ఎక్స్‌అఫీషియో సభ్యుడు, ఆలయ ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ, ఽసీనియర్ అసిస్టెంట్ ఉమామహేశ్వర్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ధర్మకర్తలు గందెసిరి సత్యనారాయణ, శ్యామ్‌సుందర్, పద్మ, ప్రశాంత్‌రెడ్డి, మంచినీళ్ల దుర్గయ్య, సీతయ్య, అశోక్, నర్సయ్య, సత్తయ్య పాల్గొన్నారు.
రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు
శ్రావణమాసం రెండో శుక్రవారం ఆగస్టు 21న ప్రతీ ఏటా నిర్వహించే వరలక్ష్మి వ్రతాలను ఈసారి కూడా నిర్వహించనున్నారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.


