డ్రోన్‌తో భూముల సర్వే
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో వచ్చే ఏడాది జూలైలో జరగనున్న గోదావరినది పుష్కరాలకు వీఐపీఘాటు నుంచి మెయిన్‌ఘాటు వరకు ఘాట్లు, రోడ్డు విస్తరణపై గోదావరి పొడవునా డ్రోన్ కెమెరాతో భూముల సర్వే చేపట్టారు. బుధవారం రెవెన్యూ, ఇరిగేషన్, ఎండోమెంట్‌శాఖల ఆధ్వర్యంలో భూములను డ్రోన్ కెమెరాతో పరిశీలించారు. కాగా, వీఐపీఘాటు నుంచి మెయిన్‌ఘాటు వరకు 860 మీటర్ల పొడవుతో 10.5 ఎకరాల భూమిని రైతులు 20 మీటర్ల వరకు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. నాలుగు రోజుల కిందట అధికారులు 50 మీటర్ల వరకు తీసుకుంటున్నామని కొలతలు పెట్టి భయబ్రాంతులకు గురిచేయడంతో రైతులు సర్వేను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి 20 మీటర్ల వరకు ఇచ్చేందుకు రైతులను ఒప్పించారు. దీంతో ఘాట్లు, రోడ్డు నిర్మాణం అడ్డంకులు తొలిగిపోయాయి. నిధులు మంజూరు కావడంతో పనులు మొదలు కానున్నాయి.
వంతెన వరకు డ్రోన్ సర్వే...
వీఐపీఘాటు నుంచి అంతరాష్ట్ర వంతెన వరకు డ్రోన్ కెమెరాతో సర్వే చేపట్టారు. గోదావరి పుష్కరాల వరకు పుష్కరఘాటు, రోడ్డు విస్తరణ చేపట్టాడానికి అధికారులు సిద్ధమవుతున్నారని తెలిసింది. ప్రస్తుతం వీఐపీఘాటు టు మెయిన్ ఘాటు వరకు సర్వే చేసినప్పటికి, పుష్కరాల వరకు మళ్లీ విస్తరణ చేయాల్సి వస్తుందని ముందస్తుగానే అధికారులు సర్వేను చేపట్టారని తెలిసింది. ఇదే కాకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలపై దృష్టిసారించారని సమాచారం.


