రైతుల సమస్యలు పరిష్కరించాలి
మల్హర్(కాటారం): కాటారం మండలం బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలో ప్రతిపాదిత చిన్న కాళేశ్వరం కాల్వ నిర్మాణ పనుల కోసం అధికారులు చేపట్టిన సర్వే ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం కాల్వ నిర్మాణానికి సంబంధించిన సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారులను గ్రామస్తులు, రైతులు అడ్డుకుని తమ ఆందోళన, నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమి తమ కుటుంబాల జీవనాధారమని, ఆ భూముల మీదుగా కాల్వ నిర్మాణం చేపడితే సాగు పూర్తిగా దెబ్బతింటుందని, తమ బతుకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల స్వాధీనం, పరిహారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు సర్వే పనులు జరగన్విమని హెచ్చరించారు. రైతుల నిరసనతో సర్వే పనులు నిలిచిపోయాయి. కాగా అధికారులు గ్రామస్తులతో మాట్లాడి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.


