‘క్యూమార్ట్’లో మిల్లెట్ యూనిట్ ఉత్పత్తులు
భూపాలపల్లి రూరల్: జిల్లాలోని చెల్పూరు మహిళ మిల్లెట్ యూనిట్ ద్వారా తయారుచేసిన పోషకాహార తినుబండారాలను హైదరాబాద్‌లోని క్యూ మార్ట్‌లో విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్‌లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన క్యూమార్ట్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా సమాఖ్య సంఘాల ద్వారా తయారవుతున్న నాణ్యమైన ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే జిల్లా యంత్రాంగం లక్ష్యమన్నారు. చెల్పూరు మహిళ మిల్లెట్ యూనిట్ ద్వారా తయారవుతున్న మిల్లెట్ పౌడర్, మిల్లెట్ రైస్, మిల్లెట్ ఉప్మా రవ్వ, రాగి లడ్డు, నువ్వుల లడ్డు వంటి పోషకాహార పదార్థాలు క్యూ మార్ట్‌లో విక్రయించనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తయారవుతున్న ఉత్పత్తులకు నగర మార్కెట్ అందుబాటులోకి వస్తుందని, తద్వారా మహిళా సంఘాల ఆదాయం పెరగడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు మరింత విస్తరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి బాలకృష్ణ, క్యూ మార్ట్ ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో విక్రయించేందుకు ఒప్పందం


