
కలుషిత నీరు తాగి విద్యార్థులకు అస్వస్థత
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల (యూఆర్‌ఎస్) విద్యార్థులు శుక్రవారం కలుషిత నీరు తాగగా ఉపాధ్యాయులు అప్రమత్తమై వెంటనే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, పాఠశాలల ఎస్‌ఓ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకేంద్రంలోని సుభాష్ కాలనీలో ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్న యూఆర్‌ఎస్‌లో ఉదయం టిఫిన్ సమయంలో 11 మంది విద్యార్థులు ఆర్వో ప్లాంట్ ద్వారా వచ్చిన నీటిని తాగారు. నీళ్లు దుర్వాసన వస్తున్నట్లు విద్యార్థులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులు రాహుల్, లక్ష్మణ్, బిట్టు, శివకుమార్, అరవింద్, మహేష్, శివకుమార్, జాడి రాంచరణ్, శ్రావణ్, అజయ్, నాగచైతన్యలను ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. విషయం తెలిసిన వెంటనే సీఐ నరేష్‌కుమార్, డీఈఓ రాజేందర్, ప్రత్యేకాధికారి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థుల పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రస్తుతం విద్యార్థులకు ఇబ్బంది లేదని వైద్యులు తెలిపారు. కలుషితమైన నీటి వల్ల అస్వస్థతకు అయిన విషయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని జరిగిన విషయాన్ని ఉపాధ్యాయులను తెలుసుకున్నారు. ఆర్వోప్లాంట్‌కు సంబంధించిన కెమికల్స్ ద్వారా తాగునీరు ఏమైనా కలుషితమైందా అనే విషయంపై డీఎంహెచ్‌ఓ మధుసూదన్ గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. తాగునీటిని ఓ బాటిల్‌లో శాంపిల్ తీసి, పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కి పంపించాడు.