
లో లెవల్... హై రిస్క్
పక్క ఫొటోలో కనిపిస్తున్నది పలిమెల మండలం ముకునూరు గ్రామ సమీపంలోని తోగువాగుపై నిర్మించిన లో లెవల్ వంతెన. ప్రతీ ఏటా మోస్తారు వర్షానికి సైతం తోగువాగు ఉప్పొంగి వంతెన మీదుగా వరద నీరు భారీగా ప్రవహిస్తుంది. దీంతో పలిమెల–ములుగు జిల్లా కన్నాయిగూడెం మీదుగా రాకపోకలు నిలిచిపోతాయి. ఫలితంగా భూపాలపల్లి నుంచి ఏటూరునాగారం, కన్నాయిగూడెం, పలిమెల, మహదేవపూర్ మీదుగా భూపాలపల్లి జిల్లాకేంద్రానికి వచ్చే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఏళ్ల తరబడి ఈ ప్రాంత వాసులు ఇబ్బంది పడుతున్నా ప్రజాప్రతినిధులు హై లెవల్ బ్రిడ్జి నిర్మించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భూపాలపల్లి: ఓ మోస్తారు వర్షాలు కురిసినా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోనున్నాయి. గోదావరి నది, మోరంచవాగు, చలివాగు, మానేరు, బొగ్గులవాగు లాంటి చిన్న, పెద్ద వాగులు, నదులు ఉన్న జిల్లాలో పలుచోట్ల లో లెవల్ కల్వర్టులు ఉండటం, అవి కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బ్యాక్ వాటర్, వరద నీరు కాజ్ వే లపై నుంచి ప్రవాహిస్తుండటంతో గ్రామాలతో పాటు జిల్లాల మధ్య కూడా రాకపోకలు నిలుస్తున్నాయి.
వర్షాకాలంలో నిలిచిపోతున్న
రాకపోకలు..
చిట్యాల మండలంలోని శాంతినగర్–టేకుమట్ల మండల కేంద్రం మధ్య గల లో లెవల్ కల్వర్టు శిథిలావస్థకు చేరుకుంది. ప్రతీ ఏటా వర్షాకాలంలో వెలిశాల గుట్టల నుంచి వరద నీరు ఈ కల్వర్టు మీదుగా సీఆర్ పల్లి వైపు వెళ్తుంది. దీంతో చిన్న వర్షానికి సైతం ద్విచక్ర వాహనాలు, ఆటోలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది డిసెంబర్ 1న కల్వర్టుపై బ్రిడ్జి నిర్మాణం కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ ఏడాది వర్షాకాలంలో కూడా తిప్పలు తప్పేలా లేవు.
9 ఏళ్లుగా సా...గుతున్న బ్రిడ్జి నిర్మాణం..
టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి–పెద్దపల్లి జిల్లా ఓడెడు మధ్య గల మానేరు వాగుపై 2016లో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జి నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు. గడిచిన 9 ఏళ్లుగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో టెండరు ఆహ్వానించి మానేరు వాగులో తాత్కాలిక మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టి రాకపోకలు సాగిస్తుంటారు. గత నెలలో కురిసిన వర్షాలకు మట్టి రోడ్డు కొట్టుకుపోయి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సదరు బ్రిడ్జి నిర్మాణ కాంట్రాక్టర్లు తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. అది కూడా రెండు, మూడు వర్షాలు కురిస్తే కొట్టుకపోయే అవకాశం ఉంది. ఫలితంగా రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడనున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని రెండు జిల్లాల ప్రజలు కోరుతున్నారు.
ఏటా వర్షాకాలంలో తప్పని తిప్పలు
చిన్న వరదలొచ్చినా
మునిగిపోతున్న వంతెనలు
పల్లెలకు నిలిచిపోతున్న రాకపోకలు
జల దిగ్బంధంలో పలు గ్రామాలు

లో లెవల్... హై రిస్క్

లో లెవల్... హై రిస్క్