పలిమెల: ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పలిమెల మండలం సర్వాయిపేటలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సర్వాయిపేట గ్రామానికి చెందిన దందెర పురషోత్తం(28) గతేడాది తనకున్న ఎకరం వ్యవసాయ భూమిలో మిరప పంట సాగు చేశాడు. తెగుళ్ల కారణంగా పంట దిగుబడి సరిగా రాలేదు. దీంతో పెట్టుబడి డబ్బులు సైతం రాలేదు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వెంటాడాయి. మనస్తాపానికి గురై ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తామస్‌రెడ్డి తెలిపారు.