పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యం

Nov 10 2026 1:25 AM | Updated on Nov 10 2026 1:25 AM

● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

● వ్యవసాయంలో సాంకేతికత వినియోగంపై సదస్సులు

● నేడు ధర్మకంచ స్టేడియంలో

జిల్లా స్థాయి రైతుమేళా

పాలకుర్తి టౌన్‌: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆదివారం మండల కేంద్రానికి చెందిన కమ్మగాని స్వాతి, శోభన్‌బాబు దంపతుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా లబ్డిదారులకు నూతన వస్త్రాలు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో కలిసి టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. అదే ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, మహిళ సాధికారత, రైతుల అభ్యున్నతి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకుసాగుతోందన్నారు. కార్యక్రమంలో నాయకులు రాపాక సత్యనారాయణ, పోగు శ్రీనివాస్‌, ఎర్రబెల్లి రాఘవరావు, వీరమానేని యాకంతరావు, కమ్మగాని నాగయ్య, మంజుల, మణేమ్మ, ఎండీ మదార్‌, గాదేపాక భాస్కర్‌, ఎల్లయ్య, కిషన్‌నాయక్‌, సునిల్‌, శ్రీనివాస్‌రావు, ఎండీ సలీం పాల్గొన్నారు.

ఆధునిక సాగుపై అవగాహన

జనగామ రూరల్‌: జిల్లాలోని రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను చేరువచేయడంతో పాటు, నూతన సాగు పద్ధతులు, అధిక దిగుబడులు సాధించే విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 10వ తేదీన(మంగళవారం) జిల్లా కేంద్రంలోని ధర్మకంచ స్టేడియంలో జిల్లా స్థాయి రైతుమేళా–2026 కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, ఆత్మ సౌజన్యంతో చేపట్టనున్న ఈ రైతు మేళా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. మేళాలో వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, సాంకేతిక పరి జ్ఞానం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.

ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు

రైతులకు ఒకే వేదికపై వివిధ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండేలా జిల్లా కేంద్రంలో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్యశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు, బ్యాంకింగ్‌ రంగం, వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మసేద్యం, అటవీ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఆయా రంగాల్లో అందుబాటులో ఉన్న నూతన సాంకేతికతలు, ఆధునిక పరికరాలు, సాగు విధానాలు, ప్రభుత్వ పథకాలు, రాయితీలు, ఆర్థిక సహాయ కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారన్నారు.

మరింత ప్రయోజనం..

రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక సాంకేతిక అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఎల్‌నినో దృష్ట్యా వాతావరణ మార్పులను తట్టుకునే నూతన పంట వంగడాలు, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, యాంత్రీకరణ పద్ధతులు, నీటి పొదుపునకు దోహదపడే బిందుసేద్యం, సూక్ష్మసేద్య పద్ధతులు, వాటికి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై నిపుణులు వివరిస్తారు. ఉద్యానవన పంటల సాగు, ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణ, పాడి పశుసంపద అభివృద్ధి, పశుపోషణ, మత్స్య సంపద అభివృద్ధి, గ్రామీణ ఆర్థికాభివృద్ధి వంటి అంశాలపై శాస్త్రవేత్తలతో రైతులకు ముఖాముఖి చర్చలు నిర్వహించనున్నారు.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వర్షపాతం మార్పులు, నీటి లభ్యత, పంటల సాగులో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేలా రైతులు శాసీ్త్రయ పద్ధతులను అవలంబించాలి. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. సాగు ఖర్చులను తగ్గించుకొని, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకోవచ్చు.

–సందీప్‌ కుమార్‌ ఝా, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement