భారీ బందోబస్తు
ఉత్సాహంగా పాల్గొన్న భక్తులు
జనగామ: నవరాత్రులు భక్తుల పూజలందుకున్న గణనాథులు బుధవారం నిమజ్జనానికి బయల్దేరారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో సుమారు రెండు వేల వరకు విగ్రహాలు కొలువుదీరగా, మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా 1,090 వినా యక విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసినా.. భక్తులు ఉత్సాహంగా గణపతి విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించారు. లింగాలఘణపురం మండలం నెల్లుట్ల చెరువు వద్ద ప్రత్యేకంగా రెండు క్రేన్లు, రెండు తెప్పలతోపాటు 40 మంది గతఈతగాళ్లతో భారీ గేట్లు ఏర్పాట్లు చేశారు.
భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర
జిల్లా కేంద్రంలో సాయంత్రం ఏడు గంటల నుంచి గణనాథుల నిమజ్జన యాత్ర సాగింది. కళాకారుల విన్యాసాలు, కోలాటాలు, భజనలు, చిన్నారులు, మహిళలు, యువత పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాలతో శోభాయాత్రలు సందడిగా సాగాయి. నెహ్రూ పార్కు, కురుమవాడ, బాలాజీనగర్, జిల్లా ఆస్పత్రి ప్రాంతం, గోకుల్‌నగర్, గ్రీన్‌మార్కెట్, శ్రీనగర్‌కాలనీ నుంచి భారీ సంఖ్యలో విగ్రహాలను భక్తులు నెల్లుట్ల చెరువుకు తరలించారు.
పూజలతో నిమజ్జనానికి శ్రీకారం
నెల్లుట్ల చెరువు వద్ద డీసీపీ రాజమహేంద్ర నాయక్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి, ఏసీపీ భీమ్‌శర్మ, సీఐలు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వేణు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూలదండలు, అక్షింతలు, పూజా సామగ్రిని ప్రత్యేక వాహనంలోకి తరలించిన అనంతరం కేవలం విగ్రహాన్ని మాత్రమే నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. భారీ వర్షం, ఊరేగింపుల జోరు మధ్య నిమజ్జన శోభాయాత్ర కొనసాగింది. పోలీసులు, అధికారులు వర్షంలో తడుస్తూనే విధులు నిర్వహిస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు. చివరి రోజు మండపాల వద్ద భజనలు, లడ్డూ వేలం పాటలు, ఇతర పూజా సామగ్రి వేలం నిర్వహించగా భక్తులు పోటీపడి కొనుగోలు చేశారు.
స్వాగత వేడుకలు
నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా విశ్వహిందూ పరిషత్, గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వాగత వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ భీంశర్మ, సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై పాల్గొన్నారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు ఎనగందుల భిక్షపతి, కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ, ఉపాధ్యక్షుడు బచ్చు బాలనా రాయణ, కోశాధికారి దిడిగం లక్ష్మణ్ పాల్గొన్నారు.
నేడు కొనసాగనున్న నిమజ్జనం
జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండో రోజు నేడు(గురువారం), 25వ తేదీ శుక్రవారం సైతం వినాయక నిమజ్జనం కొనసాగనుంది. పట్టణంలో 100, జిల్లా వ్యాప్తంగా మరో వెయ్యి విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి. జిల్లా అధికారులు నెల్లుట్ల చెరువు వద్ద ఈ నెల 25 వరకు నిమజ్జన సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు.
జనగామ: నెల్లుట్ల చెరువులోకి విగ్రహాలను తీసుకెళ్తున్న డీసీపీ రాజమహేంద్రనాయక్, సీఐలు
జనగామ: నెల్లుట్ల చెరువులో గణపయ్య నిమజ్జనం
నెల్లుట్ల చెరువు వద్ద పకడ్బందీ ఏర్పాట్లు
పర్యవేక్షించిన పోలీసులు, అధికారులు
జిల్లా వ్యాప్తంగా నేడు కొనసాగనున్న నిమజ్జనాలు
వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో సుమారు 600 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జిల్లా కేంద్రం నుంచి నెల్లుట్ల చెరువు వరకు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిమజ్జన మార్గాలు, చెరువు పరిసరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు.


