రక్తదానంలో సెంచరీ | - | Sakshi
Sakshi News home page

రక్తదానంలో సెంచరీ

Sep 24 2026 1:42 AM | Updated on Sep 24 2026 1:42 AM

జనగామ: ఎవరికి ఎప్పుడు అవసరం వచ్చినా.. రక్తదానం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.. పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌ మాచన రఘునందన్‌. జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం రెడ్‌క్రాస్‌ రక్తనిధికి 100వ సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందన్నారు. ఆరోగ్యంగా ఉన్న వారు ఏడాదికి మూడు పర్యాయాలు రక్తదానం చేయవచ్చని తెలిపారు. 1999 నుంచి ఇప్పటి వరకు 100 సార్లు రక్తదానం చేశానని రఘునందన్‌ తెలిపారు.

మోటార్‌ సైకిల్‌ రేసింగ్‌లో యువకుడి సత్తా

జనగామ: జాతీయ స్థాయి మోటార్‌ సైకిల్‌ రేసింగ్‌ పోటీల్లో జనగామ మండలం సిద్దెంకి గ్రామానికి చెందిన రవీందర్‌ కుమారుడు బీదాని రాజేందర్‌ సత్తాచాటారు. చైన్నెలోని మద్రాస్‌ ఇంటర్‌నేషనల్‌ సర్క్యూట్‌లో ఈ నెలలో నిర్వహించిన ఇండియన్‌ నేషనల్‌ మోటార్‌ సైకిల్‌ రేసింగ్‌ ఛాంపియన్‌ షిప్‌–2026లో ఆయన ప్రతిభ కనబరిచారు. టీవీఎస్‌ ఆర్‌ఆర్‌ 310 ఓఎంసీ ఎక్స్‌పర్ట్‌ కేటగిరీ–రౌండ్‌ 2, రేస్‌–1లో రాజేందర్‌ ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ మేరకు రాజేందర్‌ చైన్నెలో బుధవారం అవార్డు అందుకున్నారు. జాతీయ స్థాయిలో సిద్దెంకి గ్రామానికి గుర్తింపు తీసుకురావడంపై స్థానికులు రాజేందర్‌ను అభినందించారు.

ఈదురుగాలులతో

భారీ వర్షం

జనగామ: జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని 12 మండలాల పరిధిలో బుధవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమయ్యే సమయంలోనే వర్షం ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమైన వర్షం క్రమంగా తీవ్రత పెంచుకుంది. రాత్రి 8.30 గంటల సమయంలో దంచికొట్టిన వర్షానికి రహదారుల జలమయమయ్యాయి. పలుచోట్ల ఈదురుగాలులు వీచాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్‌ తీగలు, నీటి వనరులు, లోతైన ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

విద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సుల విద్యార్థుల బోధనకు అతిథి అధ్యాపకుల నియమకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య గుర్రం శ్రీనివాస్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ విభాగంలో రెండు పోస్టులకు, ఎమ్మెస్సీ కంప్యూటర్స్‌ ఒక పోస్టుకు, ఎంఏ తెలుగు ఒక పోస్టుకు అర్హులైన అధ్యాపకులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సంబంధిత పీజీ సబ్జెక్టుల్లో 55 శాతానికి తక్కువ కాకుండా మార్కులు కలిగి ఉండాలని, ఎస్సీఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలని పేర్కొన్నారు. పీహెచ్‌డీ, నెట్‌, బోధనలో అనుభవం కలిగినవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఈనెల 26 సాయంత్రం 4:30 గంటల్లోగా దరఖాస్తులు కళాశాలల్లో సమర్పించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement