వణికిస్తున్న శునకాలు | - | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న శునకాలు

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

జనగామ పట్టణంలోనే 4వేలకు పైగా కుక్కలు మండలాల్లో నరకమే..

మండలాల వారీగా

జనగామ పట్టణంలో

కుక్క కాటు కేసులు

వీధిలో అడుగు వేయాలంటే భయం భయం

జనగామ: జిల్లాలో వీధి కుక్కల బెడద తీవ్రస్థాయికి చేరింది. జనగామ–స్టేషన్‌ ఘన్‌పూర్‌ మున్సిపాలిటీలతో సహా 12 మండలాల్లో కుక్కల సంతతి పెరిగి పిల్లలు, వృద్ధులు, మహిళలపై దాడులు రోజువారీ వ్యవహారంగా మారింది. వందలాది మంది కుక్కల కాటుకు గురై ఆసుపత్రులు చేరగా, గొర్రెలు, మేకలను పీక్కుతుంటున్నాయి. జిల్లా ప్రజలు ఎన్నిసార్లు అధికారులను వేడుకుంటున్నా తగిన చర్యలు లేకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. రెండు మున్సిపాలిటీలు, 12 మండలాల్లో ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్‌ వరకు సుమారు 5,500 మంది కుక్క కాటుకు గురి కాగా, పదుల సంఖ్యలో గొర్రెలు, మేకలు చనిపోయాయి. కుక్కలు, కోతులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బుధవారం ‘సాక్షి’ చేపట్టిన గ్రౌండ్‌ రిపోర్టులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

జనగామ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 4వేల నుంచి 4,500 వరకు కుక్కలు సంచరిస్తున్నాయి. ఇందులో 1,484 మందికి పైగా కుక్కకాటుకు గురైన వారు ఉన్నారు. ఇటీవల 100 నుంచి 200 కుక్కలకే ఏబీసీ సెంటర్‌లో శస్త్రచికిత్స చేసినా పెద్దగా మార్పు కనిపించలేదు. బాలాజీ నగర్‌, ధర్మకంచ, రైల్వేస్టేషన్‌, గోకుల్‌నగర్‌, ఎంసీహెచ్‌ ఆసుపత్రి, కుర్మవాడ, అంబేడ్కర్‌నగర్‌, నెహ్రూ పార్క్‌, గ్రెయిన్‌ మార్కెట్‌ వంటి ప్రదేశాల్లో పదుల సంఖ్యలో కుక్కలు గుంపులుగా తిరుగుతూ బాటసారులపై దాడులకు పాల్పడుతున్నాయి.

నర్మెట మండలంలో 500 కుక్కలు ఉండగా, గడిచిన నాలుగు నెలల్లో 170 మంది కుక్కల దాడికి గురయ్యారు. వీరిలో 59 మంది పిల్లలు, 53 మంది వృద్ధులు ఉన్నారు. బచ్చన్నపేట మండలంలో గతేడాది నుంచి ఇప్పటి వరకు 243 మంది కుక్కకాటుకు గురయ్యారు. ఆయా గ్రామాల్లో గొర్రెలపై దాడులు చేసి చంపిన సంఘటనలు నమోదయ్యాయి. చిల్పూరు మండలంలో 500 కుక్కలు సంచరిస్తుండగా, నాలుగు నెలల్లో 96 మంది గాయపడ్డారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలో 340 కుక్కలు ఉంటే, మున్సిపాలిటీ పరిధిలో 145 ఉన్నాయి. గత ఏడాదిన్నర వ్యవధిలో 1,600 మంది కుక్కకాటుకు గురయ్యారు. గతంలో ఇప్పగూడెం, తాటికొండ గ్రామాల్లో గొర్రెల మందలపై విరుచుకుపడ్డాయి. కొడకండ్ల మండలంలో 500 పైగా కుక్కలు ఉండగా, నాలుగు నెలల్లో 41 మంది కాటుకు గురయ్యారు. లింగాల ఘణపురం మండలంలో మూడు నెలల క్రితం 100 కుక్కలకు శస్త్రచికిత్స చేసిప్పటికీ, 600 కుక్కలు ఉండటంతో సమస్య మునుపటి లాగే ఉంది. ఇక్కడ కూడా గొర్రెలు, మేకలపై దాడులు జరుగుతున్నాయి. జఫర్‌గఢ్‌ మండలంలో 800 కుక్కలు సంచరిస్తుండగా, వేసవి తీవ్రత కారణంగా గత నాలుగు నెలల్లో 114 మందిపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి. పాలకుర్తి మండలంలో 1,000 వరకు కుక్కలు ఉండగా నాలుగు నెలల్లో 200 మందిపై దాడులు జరిగాయి. గతంలో వల్మిడి గ్రామంలో చిన్నారి సిరి తన్వికపై కుక్కల దాడి తీవ్ర కలకలం సృష్టించింది. పాలకుర్తి కేంద్రంలో ఒకే వీధిలో గంటలో 14 మందిపై కుక్కలు దాడి చేసిన ఘటన ఇంకా ప్రజలను భయపెడుతోంది. రఘునాథపల్లి మండలంలో 1,800 కుక్కలు ఉండగా, ఈ ఏడాది 974 మంది కాటుకు గురై ఆస్పత్రి పాలయ్యారు. జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల హింస విస్తరించిన నేపథ్యంలో అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు.

మండలం కుక్కకాటు

కేసులు

నర్మెట 170

బచ్చన్నపేట 248

చిల్పూరు 96

స్టే.ఘన్‌పూర్‌ 1,600

కొడకండ్ల 401

లిం.ఘణపురం 203

జఫర్‌గఢ్‌ 114

పాలకుర్తి 256

రఘునాథపల్లి 994

మొత్తం 3,982

నెల కుక్కకాటు

జనవరి 495

ఫిబ్రవరి 416

మార్చి 313

ఏప్రిల్‌ 260

మొత్తం 1,484

జీజీహెచ్‌, ఎంసీహెచ్‌లో 1,484 కుక్కకాటు కేసులు

12 మండలాల్లో 4వేల కేసులు..

మూగజీవాలను వేటాడి

చంపుతున్న కుక్కలు

ఎన్నోసార్లు వినతిపత్రాలు

అందించినా పట్టించుకోని అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement