తమ డిమాండ్లను నెరవేర్చాలని డిపో ఎదుట కార్మికుల ధర్నా , ఆర్టీసీ సమ్మె కారణంగా జనగామ బస్ డిపోలో నిలిచి ఉన్న బస్సులు
జనగామ: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఆర్టీసీ కార్మికుల సమ్మె జనగామ డిపో పరిధిలో మొదటి రోజు బుధవారం స్వల్ప ఉద్రిక్తతలు, చిన్నపాటి వాగ్వాదాలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సమ్మె ప్రభావంతో జనగామ డిపో కార్యకలాపాలకు ఆటంకాలు తప్పలేదు.
తెల్లవారుజాము 5 గంటలకే..
జనగామ ఆర్టీసీ డిపో పరిధిలో 115 బస్సులు ఉండగా(స్పేర్‌లో కాకుండా), వాటిలో 76 ఆర్టీసీ బస్సులు, 39 ప్రైవేట్ అద్దె బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు రోజువారీగా 42 రూట్లలో 385 ట్రిప్పులు నడుపుతూ సుమారు 45 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. సాధారణంగా రోజుకు 56వేల మంది ప్రయాణికులు సేవలను వినియోగించుకుంటున్నారు. రోజువారీ టికెట్ కలెక్షన్ల డిమాండ్ రూ.23 లక్షల వరకు ఉంది. డిపోలో 108 మంది డ్రైవర్లు, 230 మంది కండక్టర్లు, 70 మంది మెకానిక్‌లతో సహా 480 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. సమ్మె మొదటి రోజున తెల్లవారుజాము 5 గంటలకు జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు డిపో ప్రధాన గేటు వద్ద శాంతియుత నిరసనకు దిగారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో సీఐ సత్యనారాయణరెడ్డి మార్గదర్శకత్వంలో ఎస్సైలు భరత్, చెన్నకేశవులు, నరేష్, నర్సయ్య, రిథీష్ తదితర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా కార్మికులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. డిపో అధికారుల ఒత్తిడితో పోలీసుల పహారా మధ్య ప్రైవేట్ అద్దె, పలు ఆర్టీసీ బస్సులను నడిపించారు. జనగామ–హనుమకొండ, సిద్దిపేట, సూర్యాపేట, ఉప్పల్ ప్రధాన రూట్లలో మొత్తం 28 బస్సులు 56 ట్రిప్పులు నడపగా, సుమారు 5,600 మంది ప్రయాణికులు సేవలు వినియోగించుకున్నారు.
మనందరి కోసం తమ్మి.. సహకరించండి
అద్దె బస్సుల డ్రైవర్లు విధుల్లోకి రావడంతో సమ్మె చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ‘తాము అందరి కోసం పోరాడుతున్నాం’ అని వివరిస్తూ వారి మద్దతు కోరారు. ఒకరిద్దరు డ్రైవర్లు సమ్మెకు సంఘీభావం తెలుపుతూ బస్సులు విడిచివెళ్లగా, మిగతావారు యథావిధిగా డ్యూటీ కొనసాగించారు. సమ్మెకు మద్దతుగా అడ్వకేట్ సాధిక్ అలీ, సీపీఐ నాయకుడు చొప్పరి సోమయ్యతో పాటు పలు పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. కార్మికులు బస్టాండ్ ఇన్‌గేట్‌లో టెంట్ వేసుకొని నిరసన దీక్ష కొనసాగించారు. కాగా హనుమకొండ–ఉప్పల్ రూట్‌లో వచ్చిన ఒక డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని కార్మికులు ఆరోపించగా, పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి ఏమీ లేదని తేల్చారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ బస్టాండ్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
సమ్మె ఎఫెక్ట్..ప్రైవేటు వాహనాల జోరు
ఆర్టీసీ సమ్మె ప్రభావంతో జిల్లా కేంద్రంలో రవాణా సమస్య ఇబ్బందిగా మారింది. హైదరాబాద్, సూర్యాపేట, హన్మకొండ, సిద్దిపేట, నర్మెట, పాలకుర్తి తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఆటోలు, క్రూజర్లు, కార్లు వంటి ప్రైవేటు వాహనాలకు గిరాకీ పెరిగింది. దీంతో మారుమూల ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. మహిళలు, వృద్ధులు, పిల్లలు 40 డిగ్రీల వేడిలో బస్సులు రాక ఇబ్బందులు పడుతూ అక్కడే ఉన్న అధికారులను ‘సార్ ఏదో ఒక బస్సులో పంపించండి’ అంటూ వేడుకున్నారు. డిపో మేనేజర్ స్వాతి పర్యవేక్షణలో బస్సు సర్వీసులను నడిపించారు.
115 సర్వీసులు....రోడ్డెక్కింది 28 బస్సులే
అద్దె డ్రైవర్లను అడ్డుకున్న కార్మికులు..
పోలీసుల రక్షణ
పరిస్థితిని స్వయంగా పరిశీలించిన
కలెక్టర్, డీసీపీ
బస్టాండ్ వద్ద దీక్షా శిబిరం


