జనగామ రూరల్: కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ హైదరాబాద్ వారు 2026–27 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ మూడేళ్ల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు చౌడేశ్వరీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లిష్ సబ్జెక్టుగా పదో తరగతి తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని, జనరల్ కేటగిరీల్లో ప్రవేశానికి 15–23 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 15–25 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో 10+2 పరీక్షలో ఉత్తీర్ణులైన వారు లేదా ఒకేషనల్ విభాగంలో 10+2 పరీక్ష పూర్తి చేసినవారు రెండో సంవత్సరంలో ప్రవేశానికి అర్హులని తెలిపారు. వివరాలకు హెల్ప్‌లైన్ నెంబర్లు 9290270501, 9505518562లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
కక్షసాధింపు రాజకీయాల్లో ధర్మం గెలిచింది
జనగామ: రాష్ట్ర ప్రభుత్వ కక్ష్యసాధింపు రాజకీయాల్లో ధర్మం గెలిచిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. మొదటి నుంచి తాము చెబుతున్నట్లుగానే, ఈ తీర్పుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం ఒక మేడిగడ్డ లేదా ఒకే నిర్మాణం కాదని, అనేక బ్యారేజీలు, వేల కిలోమీటర్ల పొడవైన కాలువలు, టన్నెల్స్, రిజర్వాయర్లు కలిపిన సమగ్ర ప్రాజెక్ట్ అని వివరించారు. రాష్ట్ర కేబినెట్ ఆమోదం పొందిన అనంతరం, ప్రభుత్వ సమష్టి నిర్ణయంగా ప్రారంభమైందన్నారు. నాటి సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావుపై ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని స్పష్టం చేశారు.
మున్సిపల్ కమిషనర్‌పై
చర్యలు తీసుకోవాలి
జనగామ రూరల్: కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి వనితా టీస్టాల్, విజయ డెయిరీ పార్లర్ డబ్బాలను తొలగించి పోలీస్ క్వార్టర్స్ గోడ పక్కన వేశారని నిరసిస్తూ బుధవారం బాధిత కుటుంబాలతో కలిసి కలెక్టరేట్ ఎదుట అఖిలపక్షాలు, ప్రజాసంఘాలు ధర్నా చేపట్టాయి. సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ అధ్యక్షతన చేపట్టిన ధర్నాలో కార్యదర్శి మోకు కనకారెడ్డి, ఎంఎస్పీ అధ్యక్షుడు గద్దల కిషోర్, ఎమ్మార్పీఎస్ గువ్వల రవి బీఆర్‌ఎస్ కౌన్సిలర్ పానుగంటి సువార్త, బూడిద జ్యోతి, హైకోర్టు న్యాయవాది ఎండీ సాదిక్ అలీ, జాక్ నాయకులు మంగళంపల్లి రాజు మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో వనితా టీ స్టాల్, విజయ మిల్క్ పార్లర్‌ను గత కలెక్టర్ ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కలెక్టరేట్ కాంపౌండ్ గోడ మూలకు ఏర్పాటు చేశారన్నారు. డబ్బాలు తొలగించాలని అధికారులు ప్రయత్నం చేయగా బాధిత మహిళలు హైకోర్టును ఆశ్రయిస్తే మే 1వ తేదీ వరకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలని తెలిపిందన్నారు. బాధితులకు స్థలాలు చూపించి వారిని ఒప్పించాల్సింది పోయి మున్సిపల్ కమిషనర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, ఆయన కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మల్లిగారి రాజు, ఇరుగు సిద్ధులు, వాంకుడోత్ అనిత, రాగల్ల ఉపేందర్, గువ్వల రవి,ఊడుగుల సాగర్, సుంచు విజేందర్ పాల్గొన్నారు.
9మంది ఎస్సైల బదిలీ
హసన్‌పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్‌స్టేషన్‌ల్లో ఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మందిని బదిలీ చేస్తూ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. సాయి ప్రసన్న కుమార్ (సీసీఎస్, వరంగల్ నుంచి నల్లబెల్లి) వి.గోవర్ధన్ (నల్లబెల్లి నుంచి వీఆర్, వరంగల్), జి.రామారావు(మడికొండ నుంచి ఘన్‌పూర్), ీసీహెచ్.రఘుపతి (ఘన్‌పూర్ నుంచి వీఆర్, వరంగల్), ఇ.నర్సింహారావు (ధర్మసాగర్ నుంచి ఎల్కతుర్తి), ఎ.ప్రవీణ్‌కుమార్ (ఎల్కతుర్తి నుంచి వీర్, వరంగల్), ఎ.శ్రీకాంత్ (వీఆర్, వరంగల్ నుంచి బచ్చన్నపేట), ఎస్.కె.హమీద్ (బచ్చన్నపేట నుంచి వీఆర్, వరంగల్), బి.మంగ (వీఆర్, వరంగల్ నుంచి ట్రాఫిక్ కాజీపేట)కు బదిలీ అయ్యారు.
ఇద్దరిపై వేటు
ఇద్దరు ఎస్సైలపై సస్పెన్షన్ వేటు వేస్తూ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్కతుర్తి ఎస్సైగా విధులు నిర్వహించిన ఎ.ప్రవీణ్‌కుమార్, నర్సంపేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రవిపై సస్పెన్షన్ వేటు వేశా రు. వీరిపై ఉన్న అవినీతి ఆరోపణలు విచారణ లో రుజువు కావడంతో సస్పెండ్ చేశారు.


