నాడు శత్రుదుర్భేధ్యం.. నేడు శిథిల దౌర్భాగ్యం | - | Sakshi
Sakshi News home page

నాడు శత్రుదుర్భేధ్యం.. నేడు శిథిల దౌర్భాగ్యం

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

అద్భుత కట్టడాలు పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు

కూలిపోతున్న సర్వాయ్‌ పాపన్న దర్బార్‌

పునరుద్ధరించాలని స్థానికుల డిమాండ్‌

స్టేషన్‌ఘన్‌పూర్‌: మండలంలోని తాటికొండ గ్రామంలో సర్దార్‌ సర్వాయ్‌ పాపన్న దర్బార్‌ శిథిలావస్థకు చేరుకుంది. పాలకుల నిర్లక్ష్యంతో చారిత్రాత్మక కట్టడమైన పాపన్న దర్బార్‌ నిరాదరణకు గురవుతోంది. బహుజన వీరుడు సర్దార్‌ సర్వాయ్‌ పాపన్న నిర్మించిన కట్టడాలు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. నియోజకవర్గంలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో సర్వాయ్‌ పాపన్న కోట ఐదేళ్ల క్రితం కూలిపోవడంతో ప్రభుత్వం స్పందించి నిధులు కేటాయించగా పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. కాగా తాటికొండలో సర్దార్‌ సర్వాయ్‌ పాపన్న నిర్మించిన దర్బార్‌ శిథిలావస్థకు చేరి బురుజు నిర్మించిన మట్టి గోడలు కూలిపోయేలా ఉన్నాయి.

క్రీ.శ.1650లో జన్మించిన సర్వాయ్‌ పాపన్న క్రీ.శ 1687–1724 కాలంలో మొగల్‌ చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాడి బహుజన నాయకుడిగా పేరుగడించారు. మొగల్‌ పాలకులు, జమీందార్లు, భూస్వాముల నుంచి పేదలు, సామాన్య ప్రజల్ని కాపాడేందుకు గెరిల్లా సైన్యం కోసం ఖిలాషాపూర్‌, తాటికొండ తదితర గ్రామాల్లో కోటలు, దర్బార్‌ల పేరిట శత్రుదుర్భేద్యమైన కట్టడాలను నిర్మించారు. శుత్రుసైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి ఓటమి ఎరుగని పోరాటాలు చేస్తూ గోల్కొండకు రాజు అయ్యాడు. ఈ క్రమంలో నిర్మించిన కోట గోడలు, దర్బార్‌లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి.

తాటికొండ దర్బార్‌, ఖిలాగుట్టపై ఉన్న ఆలయానికి మరమ్మతు చేసేందుకు ఐదేళ్ల క్రితం పురా వస్తు శాఖ అధికారులు తాటికొండలో దర్బార్‌, కట్టడాలను పరిశీలించారు. దీంతో త్వరలోనే దర్బార్‌ దశ మారనుందని స్థానికులు సంబురపడ్డారు. అయితే ఇంతవరకూ అతీగతీ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి దర్బార్‌ను పునరుద్ధరించి పర్యాటక కేంద్రంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement