● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: ధాన్యం కొనుగోళ్లలో టోకెన్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం మండలంలోని చౌడారం గ్రామ పంచాయతీ పరిధిలోని పీఎంశ్రీ మోడల్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్, ఐటీ ల్యాబ్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ ల్యాబ్, లైబ్రరీలను పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కచ్చితంగా ఉండేలా చూడాలన్నారు. బడిబాట కార్యక్రమాన్ని సమగ్రంగా, సమర్థవంతంగా నిర్వహించాలని, బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
ఉపాధి వేతన లక్ష్యాలను చేరుకోవాలి
జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పించి, దినసరి వేతనం అందేలా చూడాలని, నిర్దేశించిన లక్ష్యాలను తప్పకుండా చేరుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం పనుల పురో గతి, నిర్వహణపై కలెక్టర్ కార్యాలయంలోని మెయి న్ కాన్ఫరెన్స్ హాల్లో 12 మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇన్‌చార్జ్ డీఆర్డీఓ నూరుద్దీన్, అడిషనల్ డీఆర్డీఓ చంద్రశేఖర్, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్‌లు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.


