తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● పరిశ్రమల్లో విద్యుత్ ఉపకరణాల్లో స్పార్కులు, షార్ట్ సర్క్యూట్, ఓవర్ లోడింగ్ లేకుండా చూసుకోవాలి.
● నాణ్యతతో కూడిన ఎలక్ట్రిక్ పరికరాలను ఉపయోగించాలి.
● గ్యాస్ వాడకం పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి.
● కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పకుండా బయట పడేయొద్దు.
● సెలవులకు ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఇంటికి సంబంధించిన మెయిన్‌ను ఆఫ్ చేయాలి.
● పాఠశాలలు, ఆస్పత్రులు, హోటళ్లలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు క్షేమంగా బయటపడేందుకు సరైన ప్రణాళికలను ముందుగానే తయారు చేసుకోవాలి.
● ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా క్రమం తప్పకుండా చూసుకోవాలి
● అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైర్ అలారం మోగించాలి.
జనగామ రూరల్: జిల్లాలో ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఉదయం 7 గంటలకే భానుడు భగభగలాడిపోతున్నాడు. మే నెలలో ఎండలు మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. పెరుగుతున్న ఉష్ణ తాపంతో షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు, గృహాల్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఏటా వేసవిలో ఏదో ఒకచోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ప్రజల్లో ప్రమాదాలపై సరైన అవగాహన లేకపోవడం నిబంధనలు పాటించక పోవడంతో ఎక్కువ నష్టం జరుగుతోంది. ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి నష్టాన్ని నివారించేందుకు ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాలు ఇటీవలే ముగిశాయి. అగ్ని ప్రమాదాల బారి నుంచి కాపాడడానికి ప్రస్తుతం జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్‌లోని అగ్నిమాపక కేంద్రాల నుంచి ఫైరింజన్లు అందుబాటులో ఉన్నాయి. నియోజకవర్గానికి ఒక ఫైర్ ఇంజిన్ చొప్పున మొత్తం మూడు ఫైర్ ఇంజిన్లు ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు జిల్లావ్యాప్తంగా 84 అగ్ని ప్రమాదాలు జరిగాయి. దీంతో సుమారు రూ.45 లక్షల 11 వేల ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదం నుంచి రక్షించిన ఆస్తి విలువ రూ. కోటి 66 లక్షల 87 వేలు ఉందని అధికారులు చెబుతున్నారు.
వారోత్సవాలతో అవగాహన
తెలంగాణ ఫైర్ డజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ (అగ్నిమాపక శాఖ )ఆధ్వర్యంలో ఏటా ఏప్రిల్‌లో వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో సిబ్బందికి అవగాహన, మాక్ డ్రిల్ ప్రదర్శనలు నిర్వహించారు.
జిల్లాలో ప్రమాదాలు..
జనగామ ఫైర్ స్టేషన్ పరిధిలో గత ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ఒక్క జనగామ ఫైర్ స్టేషన్ పరిధిలోనే 51 అగ్ని ప్రమాదాలు సంభవించాయి. రెండేళ్ల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అలాగే నెల్లుట్ల కాటన్ మిల్లు అంటుకోగా అప్రమత్తతతో అపాయం తప్పింది. జనగామ ఫైర్ స్టేషన్ పరిధిలో బచ్చన్నపేట, నర్మెట, రఘునాథపల్లి, లింగాల ఘణపురం, జనగామ అర్బన్, జనగామ రూరల్ కలిపి ఆరు మండలాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాల నివారణ కోసం 4,500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఒక ఫైర్ ఇంజిన్‌తో పాటు 2,500 లీటర్ల సామర్థ్యం గల రెండు మినీ వాటర్ టెండర్స్, బుల్లెట్ వాహనం అందుబాటులో ఉన్నాయి. పాలకుర్తి స్టేషన్ పరిధిలో దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాల నివారణ కోసం ఐదు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఒక మల్టీ పర్పస్ వాటర్ టెండర్ అందుబాటులో ఉండగా, స్టేషన్ ఘన్‌పూర్ పరిధిలో జఫర్‌గఢ్, చిల్పూరు, స్టేషన్ ఘన్‌పూర్ మండలాలు ఉన్నాయి. ప్రమాదాల నివారణ కోసం 4,500 లీటర్ల సా మర్థ్యం కలిగిన ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉంది.
టోల్ ఫ్రీ నంబర్లు..
అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే అగ్ని మాపకశాఖ అధికారులకు టోల్ ఫ్రీ నంబర్ 101 ద్వారా సమాచారం అందించాలని అగ్నిమాపకశాఖ అధికారులు కోరుతున్నారు. జనగామ ఫైర్ స్టేషన్ సమాచారం అందివ్వడానికి అధికారి బి.జగదీష్, సెల్ నంబర్ 8712699347, పాలకుర్తి సీహెచ్ శ్రీరామలు 8712699348, స్టేషన్ ఘన్‌పూర్ ఎన్. దేవేందర్ నంబర్ 8712695344కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
అగ్ని ప్రమాదాలపై
అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో ప్రమాదవశాత్తు సంభవించే అగ్నిప్రమాదాల నివారణకు సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 101లో సమాచారం అందించాలి.
–రేమండ్ బాబు,
జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి
వేసవి నేపథ్యంలో అప్రమత్తత అవసరం
పొంచి ఉన్న అగ్నిప్రమాదాలపై
అవగాహన ఉండాలి
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న
అగ్నిమాపక శాఖ
ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు


