● ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయాలి
● వేతనాల్లో సుమారు 20శాతం పెంపు కల్పించాలి
● 24శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలి
● పెండింగ్‌లో ఉన్న జీతాలు, బకాయిలను వెంటనే చెల్లించాలి
● కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
● డ్రైవర్లు, కండక్టర్ల పని పరిస్థితులను
మెరుగుపరచాలి
● పదోన్నతులు పారదర్శకంగా, వేగంగా ఇవ్వాలి
● రిటైర్మెంట్ ప్రయోజనాలు (పింఛన్, గ్రాట్యుటీ తదితరాలు) మెరుగుపరచాలి
● సమ్మెల సమయంలో విధించిన కేసులు, శిక్షలను ఎత్తివేయాలి
● కార్మిక సంఘాలతో చర్చలు కొనసాగిస్తూ సమస్యలను పరిష్కరించాలి.
జనగామ: ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్త సమ్మె పిలుపు నేపథ్యంలో జిల్లాలో మరోసారి ఉద్యమ వాతావరణం నెలకొంది. కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, తమ న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకపోవడమే సమ్మెకు దారి తీసిందని గళమెత్తుతున్నారు. ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను ఒప్పుకోలేని పరిస్థితుల్లో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సమ్మె మొదలైంది. దీంతో బస్సులు డిపోకే పరిమితం కాగా, ప్రయాణ కష్టాలు మొదలయ్యాయి.
పీఆర్సీ, డీఏలపై అసంతృప్తి
2017 పీఆర్సీ ప్రకారం వేతన సవరణలు పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం, 2021లో ఇవ్వాల్సిన డీఏలు పెండింగ్‌లో ఉంచడం, ఉద్యోగ విరమణ వయస్సు పెంపు వంటి అంశాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం కార్మికుల్లో ఆగ్రహానికి కారణమైంది. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాల వల్ల ఉద్యోగ భద్రత లేకుండా పోతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థిర ఉద్యోగాలపై స్పష్టమైన విధానం లేకపోవడం వల్ల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.
పనిభారం, ఆరోగ్య సమస్యలు
జనగామ డిపోలో 470 మంది కార్మికులు ఉండగా, ఇందులో 180 మంది డ్రైవర్లు, 230 మంది కండక్టర్లు, 70 మంది మెకానిక్‌లు ఉన్నారు. రోజువారీగా డ్రైవర్లు, కండక్టర్లకు పనిభారం తప్పడం లేదు. తగిన విశ్రాంతి లేకపోవడంతో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు, గ్రాట్యుటీ పింఛన్ సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడం అసంతృప్తిని మరింత పెంచుతోంది. పలుమార్లు చర్చలు జరిపినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని సంఘాల నేతలు ఆరోపించారు. సమ్మె ప్రభావం జిల్లాలోని ప్రజలపై పడే అవకాశముంది. బస్సు సర్వీసులు ఎక్కడిక్కడ నిలిచిపోతే పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. విద్యార్థులు, ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే చర్చలకు ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు ఎ.శ్రీనివాస్, లక్ష్మీపతి, శ్రీరాంరెడ్డి, జె.శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, రాజలింగం, రాజు, బి.రెడ్డి, ఎ.శ్రీనివాస్, పాష, రామకృష్ణ డిమాండ్ చేశారు. లేదంటే సమ్మెకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని కొత్త కొర్కెలు కోరడం లేదని, మ్యానిఫెస్టోలో ఉన్న వాటిని మాత్రమే అడుగుతున్నామన్నారు. ఎలక్ట్రికల్ బస్సులను వెనక్కి పంపించి, ప్రభుత్వ బస్సు సర్వీసులను మాత్రమే నడిపించాలని డిమాండ్ చేశారు. అలాగే యూనియన్లను పునఃరుద్ధరించాలని కోరారు. అంతకుముందు సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను డిపో ఎదుట ఆవిష్కరించారు.
ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్
నిలిచిన బస్సు సర్వీసులు
ప్రభుత్వం స్పందించకపోతే
ఉద్యమం ఉధృతం
జేఏసీగా ఏర్పడిన కార్మికులు
పెండింగ్ డీఏ..పీఆర్సీ
అమలు చేయాలని డిమాండ్
జేఏసీ ఆధ్వర్యంలో గేట్ ధర్నా
జేఏసీ ఆధ్వర్యంలో గేట్‌ధర్నా
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మంగళవారం ఉదయం రెండు గంటల పాటు జనగామ డిపో ఎదుట కార్మికులు గేట్ ధర్నా చేపట్టారు. సమ్మెకు దిగేందుకు కార్మికులు ఏకతాటిపైకి వచ్చారని జేఏసీ ప్రకటించింది. సమ్మెకు అవుట్ సోర్సింగ్, ప్రై వేటు డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెకు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు.


