వరంగల్ క్రైం: పోలీస్ అధికారులకు పదోన్నతుల ద్వారా బాధ్యతలు పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ పేర్కొన్నారు. వరంగల్, జనగామ ఏఎస్పీలుగా పనిచేస్తూ పరిపాలన విభాగం అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొంది బదిలీపై వెళ్తున్న ఏఎస్పీలు, శుభం ప్రకాష్, చేతన్ నితిన్‌ను మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. డీసీపీలు అంకిత్‌కుమార్, రాజమహేంద్రనాయక్, దార కవిత, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా, అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘బెస్ట్ అవైలబుల్’ స్కీమ్‌కు దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: 2026–27 ఏడాదికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద 3వ, 5వ, 8వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని గిరిజనులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతం వారికి రూ.1,50,000 అర్బన్ వారికి రూ. 2,00,000 లోపు ఉండాలన్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక ఉంటుందని తెలిపారు. బుధవారం నుంచి 29 వరకు సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మొత్తం సీట్లు (27) లో 3వ తరగతికి 50 శాతం, 5వ తరగతికి 25శాతం, 8వ తరగతికి 25 శాతం చొప్పున కేటాయిస్తారని, మొత్తం సీట్లలో 33 శాతం బాలికలకు ఉంటుందన్నారు. ఒక కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే ఈ స్కీమ్ కింద అర్హులన్నారు. దరఖాస్తులు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం, అంబేద్కర్ భవన్ ఎదురుగా, ఆశోక కాలనీ, హన్మకొండలో పూర్తి చేసిన అప్లికేషన్లు వచ్చే నెల 7వ తేది సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలన్నారు.
24నుంచి వేసవి
క్రీడా శిక్షణ శిబిరాలు
జనగామ రూరల్: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి జూన్ 7 వరకు 14 ఏళ్ల లోపు వయసు కలిగిన బాలబాలికలకు ప్రాముఖ్యం కలిగిన కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఇతర క్రీడలలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి కె.కోదండరాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు ఉత్సాహవంతులైన వ్యాయమ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు, జాతీయ క్రీడాకారుల దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు వీసీ ఎండీ, ఎస్‌ఏటీజీ, హైదరాబాద్ వారు సూచించిన ఫీజు చెల్లించిన క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలతో తమ దరఖాస్తులను జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో 23లోపు దరఖాస్తులను అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 9182552593 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
జనగామ రూరల్: రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని ఏడీఏ అపర్ణ, ఆత్మ పథకం డీపీఎం విజయ శ్రీ అన్నారు. మంగళవారం మండలంలోని చౌడారం గ్రామంలో ఎరువుల సముచిత వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడటం వల్ల నేలలోని సహజ సూక్ష్మజీవులు నశించడంతో పాటు నేలసారం క్రమంగా తగ్గి భూమి బీడుగా మారే ప్రమాదం ఉందన్నారు. మండల వ్యవసాయ అధికారి విజయ్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు అనిల్, రాజేష్ రైతులు పాల్గొన్నారు.
ట్రెయినీ ఐఏఎస్‌గా సాయిశివాని
హన్మకొండ: తెలంగాణ కేడర్‌కు చెందిన 2025 బ్యాచ్ ఐఏఏస్ ప్రొబేషనర్లకు ప్రభుత్వం జిల్లాలకు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు ఐఏఎస్‌లను వివిధ జిల్లాలకు కేటాయించారు. ఇందులో భాగంగా సాయిశివానిని ప్రొబేషనరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా హనుమకొండ జిల్లాకు నియమించారు. వీరు 27 వరకు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


