జనగామ: జిల్లా కేంద్రంలోని కోకూన్(పట్టుగూళ్లు)మార్కెట్‌లో ధరలు తగ్గాయని రైతులు ఆందోళన చేసిన నేపథ్యంలో హార్టికల్చర్–సిల్క్ ఇండస్ట్రీ అధికారులు స్పష్టత ఇచ్చారు. మార్కెట్ పరిస్థితులు, డిమాండ్, సరఫరా ఆధారంగానే ప్రభుత్వ కోకూన్ మార్కెట్‌లో ధరలు నిర్ణయించబడతాయని రెండు శాఖల ఉన్నతాధికా రులు జె.రవికాంత్, సీహెచ్ నవీన్‌పాల్‌రెడ్డి వెల్లడించారు. ‘పట్టుగూళ్ల ధరల తగ్గింపుపై ఆగ్రహం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపూర్, రామనగర వంటి పెద్ద మార్కెట్లలో రీలర్ల సంఖ్య అధికంగా ఉండటం వల్ల ధరలు ఎక్కువగా ఉండటం సహజమని అధికారులు పేర్కొన్నారు. రైతులు పేర్కొన్నట్లుగా ధరల్లో రూ.150 నుంచి రూ.200 వరకు వ్యత్యాసం లేదని, కొన్ని సందర్భాల్లో మాత్రమే రూ.80, రూ.100 వరకు తేడా ఉంటుందని తెలిపా రు. ఇది ప్రభుత్వ వైఫల్యమో, నిర్లక్ష్యమో కాదని, తెలంగాణలో రీలింగ్ యూనిట్లు తక్కువగా ఉండడంతో మార్కెట్‌లో పోటీ పరిమితమై ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయని స్పష్టం చేశా రు. జూన్ నాటికి రాష్ట్రంలో 10 కొత్త రీలింగ్ యూనిట్లు ప్రారంభం కానున్నాయన్నారు. హిందూపూర్‌లో అమలు చేస్తున్న ఇ–మార్కెట్ విధానాన్ని జిల్లాలో కూడా జూన్ నుంచి అమలు చేస్తామని తెలిపారు. దీంతో ఇతర రాష్ట్రాలు కూడా వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఈ అంశంపై పూర్తి వాస్తవాలను తెలుసుకునేందుకు విచారణ కమిటీని ఇప్పటికే నియమించినట్లు, నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామన్నారు.
ధరల వ్యవహారంపై విచారణ కమిటీ
రైతుల్లో అపోహలు తొలగించేందుకు
ప్రభుత్వం చర్యలు


