జనగామ రూరల్: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర విద్యా సదస్సులో జిల్లాలోని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఎన్ ఎన్ రాజు, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అంకుషావలి, రాష్ట్ర కౌన్సిలర్ కుర్రంల యాదగిరి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కార్యాలయం ఉమాపతి భవన్‌లో విద్యాసదస్సు వాల్‌పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పాఠశాల విద్యా సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్, గౌరవ అతిథిగా ప్రొఫెసర్ ఎం.కోదండరాం హాజరుకానున్నారని ‘నూతన జాతీయ విద్యా విధానం రాజ్యాంగ విలువలు’ అను అంశంపై విద్యాపరిరక్షణ కమిటీ నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్, ‘తెలంగాణలో అసమాన విద్య విద్యారంగ సంక్షోభం’ అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింతకింది కాశీం ప్రసంగించనున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా బాధ్యులు వజ్రయ్య, లక్ష్మణ్ జి, సత్యనారాయణ రెడ్డి, వెంకన్న, వరప్రసాద్, గణేష్, తోటరాజు, రాజయ్య, నవీన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


