366 సెంటర్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు
జిల్లాలో అంగన్‌వాడీ సెంటర్ల
వివరాలు
అంగన్‌వాడీలు : 695
శాశ్వత భవనాలు : 243
అద్దెభవనాలు : 178
నూతన విద్యుత్ కనెక్షన్లు : 366
ఖర్చు (రూ.లక్షలు) : 26.25
ప్రైవేటులో అద్దెలేని భవనాలు : 274
గర్భిణులు : 2,419
బాలింతలు : 2,393
7 నెలల నుంచి 3 ఏళ్ల పిల్లలు : 11,744
3 నుంచి 6 ఏళ్ల పిల్లలు : 8,818
జనగామ: జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) చర్యలు చేపట్టింది. చిన్నారుల అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు కనెక్షన్ల ప్రక్రియను వేగవంతంగా చేస్తున్నారు. జిల్లాలో 695 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి పర్యవేక్షణలో ఇందులో 366 చోట్ల శాశ్వత విద్యుత్ కనెక్షన్లను ఏర్పాటు చేస్తున్నారు.
కీలకంగా విద్యుత్ వినియోగం
ప్రీస్కూల్ పేరుతో కొనసాగుతున్న అంగన్‌వాడీ సేవలను పొందుతున్న వారి సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతుండడంతో విద్యుత్ సౌకర్యం అత్యంత కీలకంగా మారింది. 329 సెంటర్లకు విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 366 చోట్ల జీపీ, ఇతర భవనాల నుంచి తాత్కాలిక పద్ధతిలో కనెక్షన్లు ఇచ్చి నడిపిస్తున్నారు. పిల్లలకు అందించే ప్రీస్కూల్ కార్యకలాపాలు, పోషక ఆహార పంపిణీ, ఆరోగ్య పరీక్షలు, వేసవి కాలంలో తాగునీటి సౌకర్యం, వెంటిలేషన్ కోసం ఫ్యాన్లు వంటి సేవలకు విద్యుత్ కీలకంగా ఉండడంతో శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన ఈ చర్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
366 అంగన్‌వాడీలకు ఉచిత కనెక్షన్లు
జిల్లాలో ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్ల్లు లేని 366 అంగన్‌వాడీలను గుర్తించి, వీటికి మొత్తం రూ.26.25 లక్షల వ్యయంతో ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లేని కేంద్రాలన్నింటినీ మ్యాపింగ్ చేసి, దశల వారీగా కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. ముందుగా పాఠశాలలు లేదా ఇతర సంస్థల సౌకర్యాలతో విద్యుత్ ఉపయోగిస్తున్న కేంద్రాలకు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా శాశ్వత సర్వీస్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా ఎన్పీడీసీఎల్ టీంలు 366 అంగనన్‌వాడీలకు మీటర్లు బిగించి, సర్వీస్ వైర్లు వేసి కనెక్షన్లు పూర్తిచేశారు. వైరింగ్ పనులు, స్టేఫ్టీ పరికరాలు, తాగునీటి మోటార్లు, లైటింగ్ తదితర పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా ఉచితంగా జరుగుతుండటం పేద ప్రాంతాల్లోని అంగన్‌వాడీలకు పెద్ద ఉపశమనం కలిగించింది.
పిల్లల అభ్యాసానికి
మెరుగైన వాతావరణం
అంగన్‌వాడీలకు విద్యుత్ వెలుగులు చేరడంతో చిన్నారులు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్య ను అభ్యసించే అవకాశం ఉంటుంది. వేసవిలో ఫ్యాన్లు, బోరు మోటార్లు పనిచేయడం వల్ల పిల్లలు, గర్భిణులు, బాలింతలు, సేవలు పొందగలుగుతున్నారు. అంగన్‌వాడీల ఆధునీకరణలో ఎన్పీడీసీఎల్ పాత్ర కీలకంగా ఉంది. జిల్లాలో రూ.26.25 లక్షల బడ్జెట్‌తో 366 కేంద్రాలకు శాశ్వత ప్రాతిపదికన కనెక్షన్లు ఇవ్వగా, అవసరమైన చోట విద్యుత్ పోల్స్ సైతం ఏర్పాటు చేశాం.
– సంపత్‌రెడ్డి, ఎస్‌ఈ, ఎన్పీడీసీఎల్
రూ.26.25లక్షల బడ్జెట్ కేటాయింపులు
ప్రీస్కూల్ కార్యక్రమాలకు మెరుగైన వాతావరణం


