కోఆప్షన్‌ ఎవరికో? | - | Sakshi
Sakshi News home page

కోఆప్షన్‌ ఎవరికో?

Mar 1 2026 7:57 AM | Updated on Mar 1 2026 7:57 AM

కోఆప్

కోఆప్షన్‌ ఎవరికో?

కడియం ఆశీస్సులు ఉన్నవారికే.. జనగామలో భిన్నంగా... పార్టీకి దరఖాస్తులు..

జనగామలో సమాన బలం.. స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెజార్టీ

లాటరీ పునరావృతమా...!

జనగామ: జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీల్లో నూతన పాలక మండళ్లు బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పుడు కోఆప్షన్‌ సభ్యుల ఎంపికపై రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. ము న్సిపల్‌ రాజకీయం కొత్త దశలోకి అడుగుపెట్టగా, రెండు పట్టణాల్లోనూ అభ్యర్థుల పోటీ, పార్టీల వ్యూహాలు, స్థానిక నేతల లాబీయింగ్‌ మరింత ఊపందుకుంటుంది.

స్టేషన్‌ఘన్‌పూర్‌లో పూర్తి మెజార్టీ సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి నాలుగు కో ఆప్షన్‌ స్థానాలు దక్కనున్నాయి. ఇక్కడ విద్యావేత్తలు, అనుభవం కలిగిన ప్రజాప్రతినిధులు, రెండు మైనార్టీ వర్గాల అభ్యర్థుల మధ్య పోటీ ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆశీస్సులు అందుకునే వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు తమ అర్హతలు, పార్టీకి చేసిన సేవలు, స్థానికంగా ఉన్న ప్రభావాన్ని ప్రస్తావిస్తూ నేతల ప్రసన్నం కోసం పరస్పరం పోటీ పడుతున్నారు.

ఇక జనగామ మున్సిపాలిటీలో పరిస్థితి భిన్నంగా ఉంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ఎక్స్‌ ఆఫీషియో ఓట్లు కలుపుకుని చెరి 16 చొప్పున సమాన బలం కలిగి ఉండటంతో కో ఆప్షన్‌ ఎన్నికలు ఎలా సాగుతాయన్నదానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాతే స్పష్టత రావాల్సి ఉంది. కో ఆప్షన్‌ కేటాయింపులో విద్యావేత్త, అనుభవం ఉన్న మాజీ కౌన్సిలర్‌, ఇద్దరు మైనార్టీలు, అందులో 50 శాతం మహిళలకు అవకాశం కల్పించాల్సి ఉండటంతో మొత్తం నలుగురు కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక జరుగనుంది. ఈ నాలుగు స్థానాల కోసం ఒక్కో పార్టీ నుంచి 5 నుంచి 10 మంది వరకు బరిలో ఉన్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు సమాన బలం ఉండగా, పోటీకి సై అంటే ఇరు పార్టీల కోఆప్షన్‌ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. ఇప్పటికే కో ఆప్షన్‌ పదవి కోసం ఆశావహులు పార్టీకి దరఖాస్తు చేసుకుంటుండగా, పోటీ అనివార్యమైతే ఎన్నికకు వెళ్లాల్సి వస్తుంది. రెండు పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాముగా మారగా, పదవి రాని నాయకులను బుజ్జగించేందుకు శక్తికి మించిన భారం పార్టీలపై పడనుంది. కానీ ఎవరికి వారే కో ఆప్షన్‌ తమకే దక్కనుందని పూర్తి విశ్వాసంతో ఉండగా, ఒక వేళ చేజారి పోతే వారిని ఎలా దారిలో పెట్టాలనే దానిపై అన్ని పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. కోఆప్షన్‌ కాకపోతే ఇతర నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం కల్పిస్తామని పలువురు నాయకులకు నచ్చ చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో భారీ పోటీ

చెరిసగం ఇచ్చుకుంటారా.. లాటరీ పునరావృతం అవుతుందా?

సమాన ఓట్లు ఉన్న నేపథ్యంలో చైర్‌పర్సన్‌ ఎన్నికల మాదిరిగానే చేతులెత్తే విధానంలో కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై తుది నిర్ణయం నోటిఫికేషన్‌ వచ్చాకే తెలుస్తుంది. ఇరు పార్టీలు అంతర్గతంగా అభ్యర్థుల ఎంపికపై ఒకే అభిప్రాయానికి రావడానికి ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. పోటీ చేస్తున్న వారిని బుజ్జగించేందుకు నాయకులు లాబీయింగ్‌ చేస్తున్నారు. వార్డుల వారీగా కౌన్సిలర్లను గెలిపించడంలో తమ పాత్రను ప్రస్తావిస్తూ కొందరు అవకాశాన్ని కోరుతుండగా, మరికొందరు రెండు, మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్నామంటూ హక్కుగా కో ఆప్షన్‌ కోరుతున్నారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లానే కో ఆప్షన్‌ ఎన్నికలు కూడా సజావుగా సాగుతాయా లేక లాటరీ పద్ధతికి వెళ్లే పరిస్థితి వస్తుందా అనే చర్చ పట్టణంలో జోరుగా సాగుతోంది. అవసరమైతే కో ఆప్షన్‌ ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేసే అవకాశం ఉందని సీనియర్‌ నాయకులు అంటున్నారు. మొత్తం మీద కోఆప్షన్‌ ఎన్నికలు స్థానిక రాజకీయాల్లో మరో కీలక మలుపుగా నిలవనున్నాయి.

కోఆప్షన్‌ ఎవరికో?1
1/1

కోఆప్షన్‌ ఎవరికో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement