పాలకుర్తిలో కేంద్ర బృందం పర్యటన
పాలకుర్తి టౌన్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 జిల్లాలో జిల్లాకు స్థానం లభించిందని బోస్టన్ కన్సల్టెన్సీ సీనియర్ మేనేజర్ ఆకాశ్ తెలిపారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ప్రతినిధుల బృందం జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఎస్సీ, మైనారిటీల శాఖ అధికారి విక్రమ్ ఆధ్వర్యంలో బోస్టన్ కన్సల్టెంట్ రాహుల్‌తో కలిసి మండల కేంద్రంలోని ఇందిర మహిళా శక్తి భవన్‌లో మహిళలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉపాధి, ఆర్థికాభివృద్ధిపై సమీక్షించారు. అనంతరం ఇందిర మహిళా శక్తి సహకారంతో నిర్వహిస్తున్న మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న దీక్ష కలెక్షన్ కేంద్రాన్ని, శ్రీసోమేశ్వరలక్ష్మీనర్సింహస్వామి ఫంక్షన్ హాల్‌ను సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఏపీడీ నూరొద్దీన్, క్లస్టర్ పరిశీలకుడు శ్రీనివాస్‌రెడ్డి, సూపరింటెండెంట్ రవీందర్, ఏపీఎం కారుపోతులు వెంకటేశ్వర్లుగౌడ్, మండల సమైక్య అధ్యక్షురాలు గునిగంటి భాగ్యలక్ష్మి, కార్యదర్శి బేజాడి సుమలత, టెక్నికల్ అసిస్టెంట్ కుమార్, దీక్ష కలెక్షన్ నిర్వహకురాలు వంగ దివ్యమహేందర్, సీఏలు పాల్గొన్నారు.


