‘ఈ–నామ్’.. మొరాయింపు
లాగిన్‌లో సాంకేతిక సమస్య
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌లో కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ–నామ్ 2.0 వెర్షన్ మొదటి రోజు బుధవారం సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా ఈ–నామ్ కొత్త వెర్షన్ ఈనెల 23 నుంచి ప్రారంభం కాగా, 25వ తేదీ నుంచి మొదలైన రైతుల డేటా నమోదు ప్రక్రియలో అనేక సమస్యలు తలెత్తాయి.
రైతులకు సంబంధించిన ఐడెంటిటీ వెరిఫికేషన్‌లో భాగంగా పేరు, లాస్ట్ నేమ్, సన్నాఫ్, డాటర్ ఆఫ్, భార్య పేరు, మొబైల్ నెంబర్, పుట్టినతేదీ, శాశ్వత చిరునామా, పిన్‌కోడ్, స్టేట్, సిటీ, తహసీల్, ఏరియా తదితర వివరాలను పూర్తిగా నమోదు చేసిన తర్వాతే తదుపరి దశకు వెళ్లే విధంగా సిస్టమ్ రూపొందించారు.ఈ క్రమంలో సైట్ ఓపెన్ అవ్వడం ఆలస్యం, సర్వర్ మొరాయింపు, లాగిన్ సమస్యలు తీవ్రమయ్యాయి. ఫలితంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క రైతు డేటా కూడా నమోదు చేయలేని పరిస్థితి ఏర్పడింది.
రైతులు కందులు, మొక్కజొన్న, చింతపండు వంటి సరుకులు అమ్ముకునేందుకు బుధవారం మార్కెట్‌కు వచ్చారు. మార్కెట్ అధికారులు రైతులు వచ్చే క్రమంలో ఎంట్రీ చేసి ఈ–నామ్ 2.0లో నమోదు చేసే క్రమంలో పని పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సరుకుల కొనుగోలు ఆలస్యం కావడంతో అధికారులు మాన్యువల్ చీటీ విధానం ద్వారా బిడ్డింగ్ చేపట్టింది. మార్కెట్ కమిటీలో పనిచేస్తున్న ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించడంతో, ఇప్పుడు ఈ కీలక పనిని సెక్యూరిటీ గార్డ్ ద్వారా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం వచ్చిన రైతులు సాయంత్రం వరకు క్యూలో నిలబడి ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ–నామ్ కొత్త వెర్షన్‌పై మార్కెట్ సిబ్బందికి ముందస్తు శిక్షణ, రైతులకు అవసరమైన డాక్యుమెంట్లపై అవగాహన లేకపోవడం సమస్యను మరింత పెంచింది. రైతులు మార్కెట్‌కు వస్తున్నప్పుడు ఏ వివరాలు తీసుకురావాలో తెలియకపోవ డంతో నమోదు ప్రక్రియకు అడ్డంకిగా మారిపోయింది. మొదటి రోజే ఇలాంటి సవాళ్లు ఎదురవుతుండడంతో ఇదే పరిస్థితి కొనసాగుతుందా లేదా సాంకేతిక లోపాలను అధిగమించి ఈ–నామ్ 2.0 సజావుగా పనిచేస్తుందా లేదా అని రైతులు, వ్యాపారులు, మార్కెట్ అధికారులు ఎదురుచూస్తున్నారు.
జనగామ మార్కెట్‌కు కందులు, మొక్కజొన్న, చింతపండు తదితర సరుకులు రాగా, మాన్యువల్‌గా చీటీ రాసి ఇచ్చారు. 32 మంది రైతుల వద్ద 104 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేయగా (మూడు రకాలవి క్వింటాల్ ధరలు రూ.7,677, రూ.6,799, రూ.7,229), 9 మంది రైతుల వద్ద 223 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేయగా(రూ.1,721, రూ.1,629, రూ.1,651), రైతులకు మద్దతు ధర కంటే చాలా తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది.
సెక్యూరిటీ గార్డుతో కంప్యూటర్ సేవలు
రైతులకు చీటీలిస్తున్న సిబ్బంది
వెరిఫికేషన్ ప్రక్రియలో సంక్లిష్టత
డేటా ఎంట్రీ ఆపరేటర్లు లేకపోవడంతో సెక్యూరిటీ గార్డులతో సేవలు
లోపాలు సరిచేస్తేనే
సజావుగా ‘2.0’ అమలు
‘ఈ–నామ్’.. మొరాయింపు
‘ఈ–నామ్’.. మొరాయింపు
‘ఈ–నామ్’.. మొరాయింపు


