మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దుచేయాలి
జనగామ రూరల్: మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయకుంటే అసెంబ్లీ ముట్టడిస్తామని జీపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం తమ సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం పలు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్‌చార్జ్ డీపీఓ వసంతకు అందజేశారు. అంతకు ముందు జీపీ కార్మికులకు బతుకమ్మకుంట నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బస్వ రామచంద్రం అధ్యక్షత అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో రాపర్తి రాజు మాట్లాడుతూ..ప్రాణాలను తీస్తున్న మల్టీపర్పస్ వర్కర్ విధానం వెంటనే రద్దు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది గ్రామపంచాయతీ కార్మికులను సమీకరించి అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్రీన్‌చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న మూడునెలల వేతనాలు చెల్లించాలన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో జీవో నెంబర్ 51 సవరణ మల్టీపర్పస్ వర్కర్ విధానంపై తీర్మానం చేయాలన్నారు. కార్యక్రమంలో నారోజు రామచంద్రం, పి.మల్లేష్, యు.రాజేశ్, టి.యాకుబ్, సంగీ కరుణాకర్, ఎన్.యాకన్న, జి. రతన్ సింగ్, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట జీపీ వర్కర్స్ యూనియన్ మహాధర్నా


