కొత్త ఆశలతో ‘ఘన’స్వాగతం
మా ఆకాంక్షలు నెరవేర్చాలి..
పారిశుద్ధ్య సమస్య
తీవ్రంగా ఉంది..
రేపు నూతన పాలకవర్గం ప్రత్యేక సమావేశం
ఈ ఫొటోలో కనిపిస్తున్నది స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వేగేటు సమీపాన ఉన్న వివేకానంద చౌరస్తా. ఘన్‌పూర్‌లో ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లేకపోవడంతో కూరగాయల వ్యాపారులు స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి పట్టణాల్లో రోడ్లపైనే కూరగాయలను విక్రయిస్తున్నారు. దాంతో ట్రాఫిక్‌కు తీవ్ర సమస్యగా ఉంది. అదేవిధంగా కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చేవారు ఇష్టారాజ్యంగా రోడ్డుపైనే వాహనాలు నిలుపుతుండగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు షాపుల యజమానులు తమ షాపులకు చెందిన బోర్డులు, హోర్డింగ్‌లు రోడ్డుపైనే పెడుతుండగా రోడ్లు ఇరుగ్గా మారి సమస్య తీవ్రమవుతోంది.
● మున్సిపాలిటీ అయినా మారని తీరు
● కంపు కొడుతున్న వార్డులు
● అధ్వానంగా రోడ్లు, డ్రెయినేజీలు
● పట్టణవాసుల ఆకాంక్షలు నెరవేరేనా!
స్టేషన్‌ఘన్‌పూర్: కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ పాలకవర్గానికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గతేడాది మున్సిపాలిటీగా మారినా పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రెయినేజీలు తదితర సమస్యలు షరా మామూలుగానే ఉన్నాయి. ప్రధానంగా మార్కెట్, రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది. ప్రత్యేకమైన సిబ్బందిని నియమించకపోవడంతో గతంలో పనిచేసిన పారిశుద్ధ్య సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. దాంతో ఏ వార్డులో చూసినా డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉండి కాలనీలు కంపుకొడుతున్నాయి. రోడ్లపై మురుగునీరు పారుతుండగా దుర్వాసనతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. పలు కాలనీలు సీసీ రోడ్లకు నోచుకోక మట్టిరోడ్లకే పరిమితమయ్యాయి. మటన్, చికెన్ వ్యాపారులు, కూరగాయలు అమ్ముకునే వారు ఇష్టారాజ్యంగా రోడ్ల పక్కన వ్యర్ధాలు వేస్తుండగా ఆయా ఏరియాలు కంపుకొడుతున్నాయి. ప్రత్యేకమైన మార్కెట్ సౌకర్యం లేక రోడ్లపై కూరగాయల వ్యాపారులు విక్రయాలు జరుపుతుండగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. రోడ్లపై చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో కాలనీలు అస్తవ్యస్తంగా కనిపిస్తుండగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మున్సిపాలిటీలో సమస్యలతో సతమతమవుతున్నామని, కొత్తగా ఏర్పడిన పాలకవర్గం పరిష్కరించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
పారిశుద్ధ్య, ట్రాఫిక్ తదితర సమస్యలపై పలుమార్లు అధికారులు, సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. శివునిపల్లిలో డ్రెయినేజీల సమస్య తీవ్రంగా ఉంది. గతంలో పలువురు విషజ్వరాలతో ఇబ్బందులకు గురయ్యారు. పాలకమండలి మా సమస్యలను పరిష్కరిస్తుందని ఆకాంక్షిస్తున్నాం.
– ఎండీ.దస్తగిరి,
పట్టణవాసి
స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్సీ కాలనీలో పలు వార్డుల్లో డ్రెయినేజీలు అధ్వానంగా ఉండగా మురుగునీరు ఇండ్ల ముందు నిలుస్తోంది. దాంతో కాలనీల్లో పందులు, దోమల స్వైర విహారంతో దుర్వాసనతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్యపై నూతన పాలకమండలి చొరవ చూపాలి.
– గుండె మల్లేష్,
పట్టణవాసి
కొత్త ఆశలతో ‘ఘన’స్వాగతం
కొత్త ఆశలతో ‘ఘన’స్వాగతం
కొత్త ఆశలతో ‘ఘన’స్వాగతం


