ఆర్టీసీకి కొమురవెల్లి ఆదాయం రూ.21లక్షలు
జనగామ రూరల్: మహాశివరాత్రి కొమురవెల్లి జాతర సందర్భంగా జనగామ నుంచి ప్రత్యేక బస్సులు నడిపినందుకు ఆర్టీసీకి రూ.21 లక్షల ఆదాయం లభించిందని ఆర్టీసీ డీఎం స్వాతి తెలిపారు. బుధవారం డిపోలో అధికారులు, సిబ్బందికి అభినందన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 14నుంచి 16 వరకు ప్రత్యేక బస్సులు 522 ట్రిప్పులతో 23,490 కిలోమీటర్లు తిప్పడం జరిగిందన్నారు. 22 వేల మంది ప్రయాణికులను చేరవేయగా ఆర్టీసీకి రూ.21.35 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. దీని కోసం కృషి చేసిన ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు.
చిన్నారుల నైపుణ్య
అంచనాకు శిక్షణ
జనగామ: రెండో తరగతి విద్యార్థుల పునాది నైపుణ్యాల అంచనాకు రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌ఎల్‌ఎన్(ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) సాంపిల్ స్టడీ నిర్వహించేందుకు ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రమేశ్ ఆదేశాలు జారీ చేశారు. తెలుగు, ఉర్దూ, గణితం, ఇంగ్లిష్ విషయాల్లో విద్యార్థుల నేర్చుకునే స్థాయిని గుర్తించేందుకు 2025–26 విద్యాసంవత్సరానికి ఈ స్టడీ చేపడుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల పరిధిలోని పలు స్కూల్స్‌ను ఎంపిక చేశారు. డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్లకు నేటి(19వ తేదీ) నుంచి 20 తేదీల్లో రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనుండగా, 23, 24తేదీల్లో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ల శిక్షణ, 25, 27 తేదీల్లో నమూనా పాఠశాలల్లో ఫైనల్ అసెస్‌మెంట్ నిర్వహిచనున్నారు. జనగామ జిల్లాకు అవసరమైన తెలుగు ప్రావీణ్యం కలిగిన 51, ఉర్దూ ప్రావీణ్యం కలిగిన 2 అవసరమున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఎంపిక చేసిన వివరాలను గూగుల్ సీట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులో జిల్లాకు రూ.1.20 లక్షలు నిధులు కేటాయించారు.
నేడు విద్యార్థి గర్జన సభ
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్‌లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని కోరుతూ ఈనెల 19న(గురువారం) ఉదయం 11 గంటలకు స్థానిక స్కాలర్స్ పాఠశాల క్రీడా మైదానంలో విద్యార్థి గర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సాదిక్ ఫౌండేషన్ చైర్మన్ సాదిక్ అలీ తెలిపారు. ఈసందర్భంగా పట్టణంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్, ఎ.పి.టి.యఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నర్సింహా రెడ్డి, విద్యా పరిరక్షణ సమితి రాష్ట్ర బాధ్యులు, రాష్ట్ర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.
వాటర్‌ప్లాంట్ ఆటో ఢీకొని చిన్నారి దుర్మరణం
స్టేషన్‌ఘన్‌పూర్: మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో ఐజల్ వాటర్ ప్లాంట్‌కు చెందిన ఆటో ఢీకొని చేపూరి మన్విత(2) అనే చిన్నారి బుధవారం సాయంత్రం మృతిచెందింది. గ్రామానికి చెందిన చేపూరి రమేశ్, అనూష దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. చిన్న కుమార్తె మన్విత. రమేశ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాయంత్రం ఛాగల్లులోని ఎస్సీ కాలనీలో మినరల్ వాటర్ పోసేందుకు వచ్చిన ఐజల్ వాటర్ ప్లాంట్ ఆటో వాహనం ప్రమాదవశాత్తు ఇంటి ముందు ఆడుకుంటున్న మన్వితను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వినయ్‌కుమార్ తెలిపారు.
ఆర్టీసీకి కొమురవెల్లి ఆదాయం రూ.21లక్షలు


