ఒకే సామాజిక వర్గానికి చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

ఒకే సామాజిక వర్గానికి చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌

Feb 18 2026 7:22 AM | Updated on Feb 18 2026 7:22 AM

ఒకే స

ఒకే సామాజిక వర్గానికి చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌

జనగామ: జనగామ మున్సిపాలిటీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 74 ఏళ్ల పురపాలక చరిత్రలో మొదటిసారిగా చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు ఒకే సామాజిక వర్గానికి దక్కాయి. కురుమ కులానికి చెందిన కడకంచి బాలమణి చైర్‌పర్సన్‌గా, భూష పర్వతాలు వైస్‌ చైర్మన్‌గా లాటరీ ద్వారా ఎన్నికయ్యారు. ఇద్దరూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించడం విశేషం. ముఖ్యంగా ఇదే వర్గానికి వరుసగా రెండు కీలక పదవులు దక్కడం జనగామలో అరుదైన సంఘటనగా నమోదైంది. ఈ పరిణామంతో కురుమ కులస్తుల్లో ఆనందం వెల్లివిరిసింది.

ఆఫర్లు వచ్చినా నో ‘జంప్‌’

జనగామ: మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల నేపథ్యంలో నాలుగు, ఐదు రోజులుగా రెండు ప్రధాన పార్టీల మధ్య అంతర్యుద్ధం ఉధృతంగా కొనసాగింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఏదీ స్పష్టమైన మెజార్టీ సాధించకపోవడంతో స్వతంత్రులతో పాటు తమ పార్టీల సభ్యులను ఆకర్షించేందుకు ఇరువైపులా విస్తృతంగా ప్రయత్నాలు జరిగాయి. కోట్ల రూపాయల వరకు ఆఫర్లు జరిగినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగినా, ఎవరూ తమ వైఖరిని మార్చకుండా తమ తమ పార్టీ పట్ల నిబద్ధతగా నిలిచారు. స్వతంత్రులు కూడా ఒకే దిశగా నిలవడంతో ఎవరూ జంపు జిలానీ కాలేదు.

చివరకు గెలిచింది..

లక్కు చీటీ!

జనగామ: మున్సిపల్‌ ఎన్నికలు ఈసారి నిజంగానే కోట్ల విలువైన లాటరీగా మారి పట్టణ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. స్థానిక నేతలు, కార్యకర్తలు, పర్యవేక్షకుల మాటల్లో ఒక్క ఓటు ధర రూ.2,500 నుంచి రూ.10 వేల వరకు పలికిందని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ, క్యాంపులు, బూచీలు, ఆర్గనైజింగ్‌ ఇలా అన్ని ఖర్చులు కలిపి మొత్తం 30 వార్డుల మీద రూ.100 కోట్ల పైగా డబ్బు చలామణి అయ్యిందనే ప్రచారం పట్టణంలో గట్టిగా వినిపిస్తోంది. ఇంత భారీ ఎలక్షన్‌ ఖర్చు అయినా, జనగామ ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. చివరకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను అధికారులు లాట రీ పద్ధతిలో నిర్వహించాల్సి వచ్చింది. కోట్ల ఖర్చు చేసి, క్యాంపులు మార్చి, గడప గడప ప్రజలను ఒప్పించిన పార్టీలకు చివరికి ‘అదృష్టం’నే నమ్ముకోవాల్సి వచ్చింది. కోట్ల ఖర్చు చేసిన పోరులో చివరికి గెలిపించింది లాటరీ చీటీ అని పట్టణవాసులు వ్యాఖ్యానిస్తున్నారు.

కేసీఆర్‌కు ఎమ్మెల్యే పల్లా శుభాకాంక్షలు

జనగామ: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా మంగళవారం జనగామ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ ఆరోగ్యంగా, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని, ప్రజల కోసం మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.

శివుడికి అన్నపూజతో అలంకరణ

జనగామ రూరల్‌: శ్రీ నగేశ్వర వాసవీ కన్యకాపరమేశ్వరి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా పూజా కార్యక్రమాలు ముగిసిన సందర్భంగా మంగళవారం శివుడికి ప్రత్యేక అన్న పూజ నిర్వహించారు. భక్తులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

జనగామ రూరల్‌: మండలంలోని చౌడారం కేజీబీవీలో ఖాళీగా ఉన్న నైట్‌ వాచ్‌ఉమన్‌, అసిస్టెంట్‌ కుక్‌ పోస్టు కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌ఓ రాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత కలిగిన మహిళా అభ్యర్థులు ఈనెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు విద్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరా లకు 9010931250, 7569087633, 970527 0551 నంబర్లలో సంప్రదించాలన్నారు.

ఒకే సామాజిక వర్గానికి చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌
1
1/1

ఒకే సామాజిక వర్గానికి చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement