ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం
● పట్టణాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం
● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మున్సిపల్
చైర్‌పర్సన్ కడకంచి బాలమణి
జనగామ: ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని, పట్టణంలోని 30 వార్డుల సమగ్రాభివృద్ధికే తన మొదటి ప్రాధాన్యమని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నూతనంగా ఎన్నికై న 22వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ కడకంచి బాలమణి తెలిపారు. మంగళవారం చైర్‌పర్సన్ ఎన్నిక అనంతరం సాక్షికి ఇచ్చిన ఇంటర్వూ ఆమె మాటల్లోనే..
అన్నివర్గాల అభివృద్ధే మా లక్ష్యం..
రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, స్ట్రీట్‌లైట్లు అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికీ పరిమితం కాదు. ప్రతీ వార్డు సమాన హక్కులతో ముందుకు సాగాలని చూస్తాం. ప్రజలకు అందుబాటులో ఉంటా. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటా.
ప్రముఖ నాయకుల మద్దతే బలం
సీఎం రేవంత్‌రెడ్డి ప్రోత్సాహంతో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరు ప్రతాపరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, డీసీసీ, అన్ని వర్గాలు తీసుకువచ్చిన ఐక్యత నా విజయానికి దోహదపడింది.
జనగామను రోల్ మోడల్‌గా చేస్తా..
పట్టణ అభివృద్ధి కోసం తక్షణ, దీర్ఘకాల ప్రణాళికలను తయారు చేస్తాం. చెత్త నిర్వహణలో స్మార్ట్ విధానం, డ్రైనేజీల పునర్నిర్మాణం, ప్రధాన రహదారుల పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెడతా. పచ్చదన పెంపునకు ప్రత్యేక కార్యక్రమాలు, మున్సిపల్ సేవల డిజిటలైజేషన్, పట్టణ ఆర్థిక వనరుల పెంపుకు కొత్త మోడల్‌ను తయారు చేస్తాం. పౌరసదుపాయాల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచుతాం. జనగామను ఇతర పట్టణాలకు ఆదర్శంగా నిలబెట్టడమే మా లక్ష్యం.
అన్ని వర్గాల సహకారం అవసరం
రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే. అభివృద్ధి ఐదు సంవత్సరాలు. అందువల్ల ప్రతీ వర్గం, ప్రతి పార్టీలోని ప్రజలూ కలిసి రావాలి. అభివృద్ధి కోసం ఏకాభిప్రాయం అత్యవసరం.
చైర్‌పర్సన్ బయోడేటా:
పేరు: కడకంచి బాలమణి
వృత్తి: వ్యాపారం
భర్త: కడకంచి శ్రీనివాస్
విద్య: గ్రాడ్యుయేషన్
పిల్లలు: కుమారుడు, కూతురు
పుట్టిన ఊరు: ఉప్పల్
ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం


