గ్రామ పాలనలో సర్పంచ్‌ల పాత్ర కీలకం
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ రూరల్: గ్రామ పంచాయతీ పాలనలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని, ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను సర్పంచులు సద్వినియో గం చేసుకుని గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. చిల్పూర్, స్టేషన్ ఘన్‌పూర్, రఘునాథపల్లి, లింగాల ఘణపురం, జఫర్‌గఢ్ మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లకు మంగళవారం మండలంలోని క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు..తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని అంశాలను, విధి విధానాలను సర్పంచ్‌లు క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకొని గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ వసంత, ట్రైనీ డీపీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
రైతు నమోదు తప్పనిసరి..
ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా, సమర్థవంతంగా అర్హులైన వారికి నేరుగా చేరేందుకు రైతు నమోదు తప్పనిసరి చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ..పది రోజుల పాటు గ్రామాల్లో ప్రణాళిక ద్వారా ఈ ఫార్మర్ రిజిస్ట్రీని పూర్తిచేయాలని ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం లో భాగంగా జిల్లాకు కేటాయించిన రూ.2.73కోట్ల కేటాయింపునకు సంబంధించిన రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే వారికి పరికరాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


