దొంగలపై నిఘా పెట్టాలి
వరంగల్ క్రైం: చోరీ కేసుల్లో శిక్ష అనుభవించి జైలు నుంచి బయటకు వచ్చే దొంగలపై నిఘా పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అధికారులకు సూచించారు. మార్చికి సంబంధించిన నెలవారీ నేర సమీక్షను పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీషీటర్లను పోలీ స్‌స్టేషన్లకు పిలిపించడం కాకుండా, అధికారులు వా రిని వ్యక్తిగతంగా కలిసి ప్రస్తుత స్థితిగతులను ఆరా తీయాలన్నారు. పోలీస్‌స్టేషన్ల పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని, సీసీ కెమెరాల పనితీరు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, కొత్త సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషిచేయాలని సీపీ ఆదేశించారు. మహిళా సిబ్బందిని ప్రోత్సహించడంతో పాటు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని చెప్పారు. జాతీయస్థాయిలో గుర్తింపు, అవార్డులు తీసుకొచ్చే విధంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ ఉండాలని, రేయింబవళ్లు ప్రజల కోసం పనిచేసి పోలీస్ శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే అధికారులకు అవార్డులు రివార్డులు ఉంటాయన్నారు. సమావేశంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్, అంకిత్‌కుమార్, జనార్దన్, జనగామ ఏఎస్పీ చైతన్య, ఏఎస్పీ మనాన్‌భట్, అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.
నెలవారీ నేర సమీక్షలో సీపీ సన్‌ప్రీత్‌సింగ్


