ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావొద్దు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ రూరల్: రైతుల నుంచి సేకరించే ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావొద్దని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్‌తో కలిసి ఆర్డీఓలు, డీఆర్డీఓ, సివిల్ సప్లయ్ అధికారులు, తహసీల్దార్లు, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు తేమ శాతం రాగానే ధాన్యం కొనుగోలు చేసి మిల్లుకు తరలించాలని, తేమ 17 శాతం వచ్చి ధాన్యం కొనుగోలు చేయని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఓపీఎంఎస్‌లో నమోదు చేయకపోయినా చర్యలు తప్పవన్నారు. అలాగే కొనుగోలు ప్రక్రియకు సంబంధించి రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని చెప్పారు. ఎండల తీవ్రత దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా, అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
బైక్ నడుపుతుండగానే మంటలు
జనగామ: జనగామ జిల్లా కేంద్రం రైల్వేస్టేషన్‌రోడ్డున పోలీస్టేషన్‌కు కూతవేటు దూరంలో నడుపుతున్న బైక్ నుంచి మంటలు చెలరేగిన ఘటన శుక్రవారం జరిగింది. సూర్యపేటరోడ్డుకు చెందిన ఓ వ్యక్తి బైక్‌పై రైల్వేస్టేషన్‌కు వెళ్లే సమయంలో రన్నింగ్‌లోనే పెట్రోలు ట్యాంకు నుంచి మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో సదరు వ్యక్తి బైక్‌ను వదిలి పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికులు వెంటనే బకెట్లలో నీటిని తీసుకువచ్చి మంటలు ఆర్పేయగా, అప్పటికే సగం కాలిపోయింది. ఈ ఘటన ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది.
భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి
జనగామ రూరల్: జాతీయ రహదారి – 365బి నిర్మాణంలో ప్లాటు కోల్పోతున్న నిర్వాసితులకు సర్వే రిపోర్టు ప్రకటించి గజానికి రూ.15 వేలు పరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూసేకరణ చట్టం మేరకు సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, నిర్వాసితులు వేమునూరు రాజేంద్రప్రసాద్, గూడెల్లి కృష్ణారెడ్డి, బిర్రు స్వప్న, గంగుల భూపాల్ రెడ్డి, ఉప్పరి విజయ్, గంగుల అనంతరెడ్డి, గంగుల తిరుపతిరెడ్డి, బి.విశ్వనాథం, నల్ల యాదగిరి, ఎండీ.సలీం, శ్రీనివాస్, రాజశేఖర్, ఎం.చంద్రారెడ్డి, పి.శ్రీలత, బి.చంద్రయ్య, నరసింహారెడ్డి పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావొద్దు
ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావొద్దు
ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావొద్దు


