
బతుకమ్మకుంటను అభివృద్ధి చేయండి
● వాకర్స్ వినూత్న నిరసన
జనగామ : పట్టణంలోని బతుకమ్మ కుంటను అభివృద్ధి చేయాలని కోరుతూ వాకర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిట్టల సురేష్ ఆధ్వర్యంలో వాకర్స్ శనివారం ప్లకార్డులతో వినూత్న నిరసన తెలిపారు. కుంట అపరిశుభ్రతపై ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనాలకు వాకర్స్ అసోసియేషన్ స్పందించి ఆందోళన చేట్టారు. కుంటలోని నీరు చెత్తాచెదారంతో నిండి దుర్వాసన వెదజల్లుతోందని పాముల సంచారం, కోతుల స్వైర విహారం, అసాంఘిక కార్యకలాపాలతో బతుకమ్మ కుంట అధ్వానంగా తయారైందన్నారు. కుంటను అభివృద్ధి చేయని పక్షంలో నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. ప్రస్తుతం కుంట వద్ద నిమి షం సమయం కూడా కూర్చుండే పరిస్థితి లేదన్నారు. వీధిలైట్లు సరిగా వెలగక పోవడంతో భయాందోళనగా ఉందని చెప్పారు. పిల్లలకు ఆట పరికరాలు, వాకింగ్ ట్రాక్, పార్కు, పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తుంగ కౌశిక్, వెంపటి అజయ్, దినేష్, ఈశ్వర్, సాయి, అర్జున్ వినయ్, అభినవ్, శ్రీకాంత్, సిద్దు తదితరులు పాల్గొన్నారు