వెల్గటూర్: గుంతలరోడ్డుతో వేగలేకపోతున్నామని, రోడ్డు నిర్మాణం చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని జగదేవుపేట గ్రామస్తులు మండల కేంద్రంలో శనివారం ధర్నాకు దిగారు. వారి కథనం ప్రకారం.. 15 ఏళ్లుగా జగదేవుపేట, చర్లపల్లి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణానికి వీలు లేకుండా ఉందని, నాయకులు మారినా సమస్య తీరడం లేదని, ఎన్నికల సమయంలో రోడ్డు నిర్మిస్తామని హామీ ఇవ్వడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. జంగల్‌నాలా ప్రాజెక్టుకు లిఫ్ట్ ద్వారా నీళ్లు నింపుతామని హామీ ఇచ్చినా నెరవేరలేదన్నారు. అక్రమంగా నిర్వహిస్తున్న క్రషర్లతో దుమ్ము, ధూళి, పొగ గ్రామంలో వ్యాపించి శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఓవర్ లోడ్‌తో నడిచే వందలాది టిప్పర్లతో రోడ్లు ధ్వంసం అవుతున్నాయని తెలిపారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పందించి న్యాయం చేయాలని, లేదంటే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


