● రాత్రివేళ టిప్పర్లతో మట్టి అక్రమ రవాణా ● నిబంధనలు తుంగలోకి ● రైస్‌మిల్లు పూడ్చివేత కోసం దందా ● మూడు టిప్పర్లు, పొక్లెయిన్ సీజ్ ● నలుగురిపై కేసులు నమోదు
గొల్లపల్లి: గొల్లపల్లి మండల కేంద్రంలోని నల్లగుట్ట ప్రాంతంలో మట్టి మాఫియా బరితెగించింది. క్రషర్ గుట్ట (భీముని గుట్ట) నుంచి అనుమతులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో సాగిస్తున్న మట్టి అక్రమ దందాను స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు శనివారం వేకువజామున బట్టబయలు చేశారు.
చీకటి మాటున కొల్లగొట్టుడు
15 రోజులుగా రాత్రి 10 గంటల నుంచి వేకువజామున 5 గంటల వరకు ఈ చీకటి వ్యాపారం నిరాటంకంగా సాగుతోంది. క్రషర్ గుట్ట నుంచి తవ్విన మట్టిని అబ్బాపూర్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఓ ప్రైవేట్ రైస్ మిల్లు పూడ్చివేత పనులకు తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో గొల్లపల్లి సర్పంచ్ నల్ల నీరజ భర్త సతీష్ రెడ్డి, ఉపసర్పంచ్ గురుజాల బుచ్చిరెడ్డి అర్ధరాత్రి రంగంలోకి దిగారు. పీహెచ్‌సీ వద్ద ఒక టిప్పర్‌ను, నేరుగా గుట్ట వద్దకు వెళ్లి మరో మూడు టిప్పర్లను అడ్డుకుని అధికారులకు సమాచారం అందించారు.
ప్రజాప్రతినిధులు, అధికారులపై బెదిరింపులు
సమాచారం అందుకున్న వెంటనే ఆర్‌ఐ బాపురెడ్డి, జీపీవో జవహర్, పోలీస్ సిబ్బంది శుక్రవారం రాత్రి 10:30 గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో టిప్పర్ డ్రైవర్లు అధికారులు, ప్రజాప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. శ్రీఅందరికీ అమ్యామ్యలు ముట్టజెప్పినం.. అడ్డుకోవడానికి మీరెవరు..? అంటూ బెదిరింపులకు దిగడం గమనార్హం. అయినప్పటికీ అధికారులు ససేమిరా అనడంతో వాహనాల టైర్లలో గాలి తీసివేసి.. తాళాలు వేసి డ్రైవర్లు పరారయ్యారు. వేకువజామున 3 గంటల ప్రాంతంలో మళ్లీ వచ్చిన డ్రైవర్లు టిప్పర్లలోని మట్టిని అక్కడే అన్‌లోడ్ చేసి తప్పించుకునే యత్నం చేయగా.. అప్పటివరకు అక్కడే కాపలాగా ఉన్న ప్రజాప్రతినిధులు గట్టిగా నిలదీసి పట్టుకున్నారు.
సీజ్.. క్రిమినల్ కేసులు..
శనివారం ఉదయం తహసీల్దార్ మాజీద్ ఆదేశాల మేరకు మూడు టిప్పర్లు, ఒక పొక్లెయిన్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. టిప్పర్ల యజమానులు, డ్రైవర్లయిన వెల్గటూర్‌కు చెందిన బొల్లపు మహేష్, గూడెంకు చెందిన కారంగుల సుశీల, ఓర్సు ఆనందం పొక్లెయిన్ యజమాని, పెగడపల్లికి చెందిన ఈరవేణి ప్రశాంత్‌పై కేసులు నమోదు చేశారు.
ఖజానాకు గండి
ప్రభుత్వ భూమి లేదా గుట్ట నుంచి మట్టి తరలించాలంటే తహసీల్దార్ క్షేత్రస్థాయి విచారణ, కలెక్టర్ లేదా ఆర్డీవో పరిపాలనా అనుమతి, మైనింగ్ శాఖ ఎన్‌వోసీ తప్పనిసరి.
మైనింగ్ శాఖకు చెల్లించాల్సిన సీనరేజ్ ఫీజు, డీఎంఎఫ్ నిధులు ఎగ్గొట్టి అక్రమంగా తరలిస్తుండటంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది.
పదిహేను రోజులుగా ఇంత బహిరంగంగా దందా సాగుతుండటం వెనుక ఏ స్థాయి వ్యక్తుల అండదండలు ఉన్నాయన్నది మండలంలో చర్చనీయాంశంగా మారింది.
కొద్దిపాటి జరిమానాతో వాహనాలను విడిచిపెట్టేందుకు ఒత్తిళ్లు వస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. సమగ్ర విచారణ జరిపి అసలు సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


