జగిత్యాలరూరల్: ప్రభుత్వ ఆస్పత్రిలో సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. బీర్‌పూర్ మండలం తుంగూర్‌కు చెందిన బండారి సుశీల అనారోగ్యంతో మృతిచెందగా.. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుశీల మరణం బాధాకరమని, సకాలంలో వైద్యం అందకపోవడం ఆవేదన కలిగించిందన్నారు. ఆమెకు నిమ్స్‌లో చికిత్స అందించేందుకు వైద్యులతో మాట్లాడగా.. వెంటిలేటర్ అందుబాటులో లేదన్నారని, గాంధీ ఆస్పత్రిలో చేర్పిస్తే ఆపరేషన్‌కు అవసరమైన యంత్రాలు పనిచేయడం లేదని సూపరింటెండెంట్ సమాచారం ఇచ్చాడని వెల్లడించారు. ఉస్మానియా ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో సుశీల మృతిచెందడం బాధాకరమన్నారు. నిమ్స్‌లో వెంటిలేటర్ల కొరత, గాంధీ ఆస్పత్రిలో పరికరాలు ఏడాదిగా పనిచేయకపోవడమేంటని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ సేవలు అందడం లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన వైద్య పరికరాలు, వెంటిలేటర్లు, నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, మాజీ జెడ్పీటీసీ కొల్ముల రమణ, మాజీ ఎంపీపీ మసర్థి రమేశ్, మాజీ సర్పంచులు జితేందర్, ముక్క శంకర్, ఆడెపు తిరుపతి, నాయకులు సుభాష్, జోగిరెడ్డి, మొండయ్య, శేఖర్ పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
జగిత్యాలక్రైం: సైబర్ నేరాల నివారణకు అప్రమత్తత, అవగాహన ఎంతో అవసరమని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శనివారం సైబర్ ఫ్లాష్ వాక్ నిర్వహించారు. ఆగండి – ఆలోచించండి – ధ్రువీకరించండి నినాదంతో నిర్వహించిన ఈ ఫ్లాష్ వాక్ పాత బస్టాండ్ నుంచి తహసీల్దార్ చౌరస్తా వరకు కొనసాగింది. డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, పట్టణ సీఐ కరుణాకర్, సైబర్ క్రైం సీఐ కృష్ణమూర్తి, ఎస్సైలు కిరణ్ కుమార్, దినేష్, మహేశ్, మల్లేశ్, సుప్రియా, సైబర్ క్రైం సిబ్బంది పాల్గొన్నారు.
దేశ ఐక్యతకు మార్గదర్శి వల్లభాయ్ పటేల్
దేశ ఐక్యతకు వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని స్మరించుకుందామని ఎస్పీ అన్నారు. పోలీస్ కార్యాలయంలో పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీఐలు వేణు, సైదులు, శ్రీధర్, ఆర్‌ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అర్ధరాత్రి వేళ నిఘా పటిష్టం
శాంతిభద్రతల పరిరక్షణకు రాత్రి సమయంలో నిఘాను మరింత బలోపేతం చేస్తున్నామని ఎస్పీ అన్నారు. శుక్రవారం రాత్రి జగిత్యాల, మెట్‌పల్లి ప్రాంతాల్లో పర్యటించి పెట్రోలింగ్ విధానాన్ని పరిశీలించారు. రాత్రి సమయంలో సమర్థవంతమైన పెట్రోలింగ్ నిర్వహించడం ద్వారా ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందన్నారు.
విధి నిర్వహణలో ఉద్యోగుల పాత్ర కీలకం
విధి నిర్వహణలో ఉద్యోగుల పాత్ర కీలకమని అడిషనల్ ఎస్పీ అన్నారు. ఎస్సై మహ్మద్ అలీమోద్దీన్, ఏఆర్ ఎస్సై అహ్మద్‌ఖాన్ ఉద్యోగ విరమణ పొందగా.. వీడ్కోలు పలికారు.


