కోరుట్ల: ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛత నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ వర్కర్లకు ఆర్నెళ్లుగా వేతనాలు అందడం లేదు. తాత్కాలిక పద్ధతిన నియామకం అయిన వీరు వేతనాల కోసం ఎవరిని అడగాలో తెలియక పాఠశాలల్లో వెట్టిచాకిరీ చేయాల్సిన దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇతర జిల్లాల్లోని వర్కర్లకు వేతనాలు వస్తుండగా.. జిల్లా మాత్రం ఆర్నెళ్లుగా ఇవ్వడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా..
జిల్లాలోని 1609 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో తరగతి గదులు, టాయ్‌లెట్లను పరిశుభ్రంగా ఉంచాలన్న యోచనతో గత జూన్‌లో స్వచ్ఛ కార్మికుల నియామకానికి విద్యాశాఖ అనుమతించింది. విద్యార్థుల సంఖ్యకు ఆధారంగా ఒకరు..ఇద్దరు లేదా ముగ్గురు కార్మికులను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వీరి వేతనాలను పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి నిర్ధారించారు. ఏదైనా పాఠశాలలో 200 మందికి పైగా విద్యార్థులు ఉంటే కార్మికులకు రూ.10 వేలు, వంద లోపు విద్యార్థులు ఉంటే రూ.6వేలు, 30 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో రూ.3 వేలు చెల్లించేందుకు నిర్ణయించారు. ఇలా జిల్లాలో సుమారు 670మందిని నయమించారు. వీరు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉండాల్సి ఉంటుంది.
అందని వేతనాలు
జూన్‌లో కార్మికుల నియామకం జరగగా.. అప్పటినుంచి ఇప్పటివరకు నయాపైసా వేతనం అందలేదు. ఆర్నెల్లు వేతనాలు పెండింగ్‌లో ఉండడంతో కుటుంబ పోషణ భారంగా మారిందంటున్నారు కార్మికులు. కనీసంగా రూ.60వేల నుంచి రూ. 18వేల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇతర జిల్లాలో ఇదే రీతిలో పనిచేస్తున్న స్వచ్చత కార్మికులకు వేతనాలు వస్తున్నట్లు కార్మికులు చెబుతున్నారు. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా తమకు వేతనాలు వస్తాయని ఆశపడినా..చేతిలో నయారూపాయి లేక నానా అవస్థలు పడ్డారు. పనిచేస్తున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అడుగుతున్నప్పటికీ వేతనాలు రాలేదన్న సమాధానాలు విని విసిగిపోతున్నారు.


