నిజామాబాద్‌అర్బన్: దంపతులపై దాడి చేసిన కేసులో ఇద్దరు నిందితులను నిజామాబాద్ ఒకటో టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ నగరానికి చెందిన దంపతులు రెండు రోజుల క్రితం బోధన్‌రోడ్‌లోని ఫిష్ మార్కెట్ వద్ద నిలబడి ఉన్నారు. ఓ ఆటో వేగంగా రావడంతో నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. దీంతో ఆటోలో ఉన్న డ్రైవర్ కమ్మరి రాజు, రామంచ విష్ణు వారితో వాగ్వాదానికి దిగి రాడ్‌తో దాడి చేసి పారిపోయారు. దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన కమ్మరి రాజు, కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రామంచ విష్ణుగా గుర్తించారు. శనివారం వాహనాలను తనిఖీ చేస్తుండగా వీరు పట్టుబడ్డారని ఎస్‌హెచ్‌వో తెలిపా రు. కమ్మరి రాజుపై గతంలో కరీంనగర్ టూ టౌన్, గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, కమ్మర్‌పల్లి, కామారెడ్డి, ఆర్మూర్, మోపాల్ నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో వాహనాల చోరీ కేసులు ఉన్నట్లు ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపారు. రెండో నిందితుడు రామంచ విష్ణుపై నిజామాబాద్ వన్ టౌన్, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ నాలుగో టౌన్, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో చోరీ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. నిందితులు ఉపయోగించిన ఆటో సైతం అపహరించినదేనని తెలిపారు. ఆటో చోరీపై నిజామాబాద్ వన్‌టౌన్‌లో కేసు నమోదైందన్నారు.


