రాయికల్: రాయికల్ పట్టణంలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రికి ప్రతిరోజూ వందలాది మంది రోగులు వస్తుంటారు. పట్టణం, మండలంలోని 32 గ్రామాలతోపాటు చుట్టుపక్క మండలాలైన మల్లాపూర్, కోరుట్ల, నిర్మల్ జిల్లా కడెం నుంచి ఇక్కడి ఆస్పత్రికి వచ్చి వైద్యసేవలు పొందుతుంటారు. అయితే ఆస్పత్రిలో సరైన వసతులు లేక వైద్యులు, రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అసౌకర్యాల మధ్య సేవలు
ఆస్పత్రిలో ఇన్వర్టర్ ఉన్నా.. సామర్థ్యం సరిపోలేదు. జనరేటర్ కోసం నిధులు మంజూరైనా.. ఇప్పటివరకు తెప్పించడం లేదు. రోగులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వాటర్ ప్లాంట్ లేదు. కేవలం లయన్స్‌క్లబ్ సభ్యులు ప్రతిరోజు బాటిళ్ల ద్వారా అందించే నీరే దిక్కవుతున్నాయి. ఆపరేషన్ థియేటర్‌లో సరైన పరికరాలు లేవు. ఆపరేషన్ సమయంలో వైద్యులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. నవజాత శిశువుల కోసం వార్మర్ హీట్ థెరపీ వంటి సౌకర్యం లేకపోవడంతో జిల్లా కేంద్రానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం కుర్చీలు, టేబుళ్లు లేకపోవడంతో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆస్పత్రి ఆవరణతోపాటు, పలు గదుల్లో రూప్ లీకేజీలు ఎక్కువ కావడంతో వర్షం కురిస్తే లీకై గదులు జలమయం అవుతున్నాయి. ఫర్నిచర్, కంప్యూటర్లు లేక నానా అవస్థ పడుతున్నామని సిబ్బంది అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ స్పందించి వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిలో యుద్ధ ప్రతిపాదికన వసతులు కల్పించాలని కోరుతున్నారు. నేడు ఆయన అధ్యక్షతన జరిగే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఆపరేషన్ థియేటర్‌లో పరికరాల కొరత
తాగునీటికి రోగుల గోసగోస
రాయికల్ ఆస్పత్రి సమస్యలు పట్టేదెవరికీ..?
నేడు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం


