మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో శనివారం ముగిసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 69వ రాష్ట్రస్థాయి అండర్–14 హ్యాండ్‌బాల్ టోర్నమెంట్లో బాలుర విభాగంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు సత్తాచాటి చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. బాలికల్లో మహబూబ్‌నగర్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. స్థానిక హీరా హోడల్ స్కూల్ మైదానంలో జరిగిన బాలుర ఫైనల్ ఉత్కంఠపోరులో మహబూబ్‌నగర్ జట్టు 7–5 గోల్స్ తేడాతో వరంగల్‌పై విజయం సాధించింది. మహబూబ్‌నగర్ హైస్కూల్ మైదానంలో జరిగిన బాలికల విభాగం ఫైనల్లో ఆదిలాబాద్ జట్టు 10–6 గోల్స్ తేడాతో మహబూబ్‌నగర్‌పై గెలుపొందింది. బాలుర విభాగంలో మూడోస్థానంలో నిజామాబాద్, బాలికల్లో కరీంనగర్ మూడో స్థానంలో నిలిచింది. అంతకుముందు బాలుర సెమీఫైనల్ మ్యాచుల్లో మహబూబ్‌నగర్ 11–6 గోల్స్ తేడాతో నిజామాబాద్‌పై, వరంగల్ జట్టు 5–2 గోల్స్ తేడాతో కరీంనగర్‌పై గెలుపొందాయి. బాలికల విభాగం సెమీఫైనల్ మ్యాచుల్లో మహబూబ్‌నగర్ జట్టు 6–3 గోల్స్ తేడాతో వరంగల్‌పై, ఆదిలాబాద్ జట్టు 7–2 గోల్స్ తేడాతో కరీంనగర్‌పై విజయాలు నమోదు చేసుకున్నాయి. విజేతలకు ప్రముఖ పారిశ్రామికవేత్త బెక్కరి రాంరెడ్డి తదితరులు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో హ్యాండ్‌బాల్ టోర్నీ రాష్ట్ర పరిశీలకులు రఫత్ ఉమర్, అశోక్, ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.


