కొడిమ్యాల: మండలంలోని డబ్బు తిమ్మయ్యపల్లి ప్రాథమిక పశు వైద్యశాల మందుబాబుల అడ్డాగా మారిందని పశు వైద్యాధికారి కమలాకర్ అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఆవరణ అంతా మద్యం సీసాలు, సిగరెట్ ముక్కలతో దర్శనమిస్తోంది. దీనిపై స్థానిక రైతులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి చుట్టూ ప్రహరీ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఆకతాయిలు లోపలికి ప్రవేశించి మద్యం సేవిస్తున్నట్లు తెలిసింది. తాగిన మత్తులో ఖాళీ సీసాలను ఆసుపత్రి ఆవరణలోనే పగలగొడుతున్నారు. దీంతో పగటిపూట పశువులను చికిత్స కోసం తీసుకొచ్చే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశు వైద్యశాలపై నిఘా ఉంచి రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పశువైద్యాధికారి కమలాకర్, స్థానికులు కోరుతున్నారు.


