● ‘కరీంనగర్‌కు చెందిన రమేశ్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడుతూ ఆటో అదుపు తప్పి చొప్పదండి రోడ్‌లో డివైడర్‌కు ఢీకొట్టాడు. అందులో ప్రయాణిస్తున్న వారికి ప్రమాదం తప్పగా, రమేశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆటో ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.’
● ‘జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఉద్యోగం చేసే శ్రీకాంత్ అనే 32 ఏళ్ల యువకుడు తీరిక దొరికి సమయంలో సెల్‌ఫోన్ గేమ్‌లు అధికంగా ఆడుతూ అధిక రక్తపోటు బారినపడ్డాడు. ఒక రోజు మెడలు నొప్పులు వస్తున్నాయని ఆసుపత్రికి వెళ్తే వైద్యులు పరీక్షించి టెక్‌నెక్ గురయ్యావని, సెల్‌ఫోన్ చూడడం తగ్గించాలని సూచించారు’
కరీంనగర్/గొల్లపల్లి/వీర్నపల్లి: ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు.. చేతిలో సెల్‌ఫోన్ ఉండాల్సిందే. నిద్ర లేవగానే నోటిఫికేషన్లు చూడటం.. ఖాళీ దొరికితే సోషల్ మీడియా.. భోజనం చేస్తూ వీడియోలు.. ప్రయాణంలో గేమ్స్.. నిద్రకు ముందు గంటల తరబడి రీల్స్... అవసరా న్ని మించి అరచేతిలోని సెల్‌కు బానిసలుగా మారుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. వినోదం, సమాచారం, అత్యవసర సేవలకు ఉపయోగపడే సెల్‌ఫోన్.. పరిమితి దాటితే ఆరోగ్యానికి చేటు చేస్తోంది. ఇప్పటికే దీర్ఘకాలం స్క్రీన్ చూస్తున్న వారిలో కంటి సమస్యలు, మెడ, భుజాల నొప్పులు, నిద్రలేమి, ఒత్తిడి వంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి.
కళ్లపై పడుతున్న స్క్రీన్ భారం
సెల్‌ఫోన్‌ను దగ్గరగా పెట్టుకుని ఎక్కువసేపు చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. కళ్లు పొడిబారడం, మంట, నీరు కారడం, తలనొప్పి, చూపు మసకబారడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా చీకటి గదిలో పడుకుని ఫోన్ చూడటం మరింత ఇబ్బందులకు కారణమవుతుంది. స్క్రీన్‌ను చూస్తున్నప్పుడు రెప్పలు తక్కువగా కొట్టడం వల్ల కళ్లలో తేమ తగ్గుతుంది. దీంతో కొంతమందిలో కంటి అలసట పెరుగుతుంది.
నిద్రకు సెల్‌ఫోన్ గండి.
పడుకునే ముందు మొబైల్ చేతిలోకి తీసుకోవడం చాలామందికి అలవాటుగా మారింది. ఒక వీడియో తర్వాత మరో వీడియో.. ఒక మెసేజ్ తర్వాత మరో చాట్.. ఇలా సమయం తెలియక రాత్రి వేళల్లో మెలకువగా ఉండిపోతున్నారు. స్క్రీన్ వెలుతురు, ముఖ్యంగా నిద్రకు ముందు అధిక స్క్రీన్ వినియోగం, నిద్ర సమయాన్ని ఆలస్యం చేయడంతో పాటు నిద్ర నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. ఫలితంగా ఉదయం అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం కనిపించే అవకాశం ఉంది. ఎక్కువసేపు ఫోన్ చూస్తే తలను వంచడం వల్ల ‘టెక్ నెక్’, మెడ–భుజాలు–వెన్నునొప్పి వంటి సమస్యలు రావచ్చు. శారీరక చురుకుదనం తగ్గి అధిక బరువు, ఊబకాయం ముప్పు పెరగవచ్చు. ముఖ్యంగా వాహనం నడుపుతూ లేదా రోడ్డు దాటుతూ ఫోన్ మాట్లాడడం, చూడటం ప్రమాదకరం.
పిల్లల్లో ప్రభావం మరింత ఎక్కువ
పిల్లలను ప్రశాంతంగా ఉంచేందుకు మొబైల్ అలవాటు చేయడం వల్ల కార్టూన్లు, గేమ్స్, సోషల్ మీడియో అంటూ స్క్రీన్ టైమ్ క్రమంగా పెరుగుతోంది. అధిక వినియోగం చదువుపై ఏకాగ్రత, పనులు పూర్తి చేసే సామర్థ్యం, నిద్ర వేళలను ప్రభావితం చేయవచ్చు. బయట ఆడటం, శారీరక శ్రమ, స్నేహితులతో కలవడం తగ్గడం వల్ల ఫిట్‌నెస్ దెబ్బతిని అధిక బరువు సమస్యలు రావచ్చు. మెడ, వెన్ను, కంటి సమస్యలతో పాటు మాట్లాడటం, చదవటం, రాయటం, కుటుంబంతో కలిసిమెలిసి ఉండటం వంటి సహజ కార్యకలాపాలకు సమయం తగ్గితే సామాజిక, ప్రవర్తనా అభివృద్ధిపైనా ప్రభావం పడవచ్చు. అందుకే పిల్లల స్క్రీన్ వినియోగాన్ని తల్లిదండ్రులు పరిమితం చేసి, వయసుకు తగిన కంటెంట్ మాత్రమే అందేలా పర్యవేక్షించాలి.
కోపం, చిరాకు పెరుగుతాయి...
సెల్‌ఫోన్ ఎక్కువ సేపు చూసే వారిలో, మాట్లాడే వారిలో ఒత్తిడి, ఆందోళన కారణంగా నిద్రిలేమి సమస్యతో మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. కోపం, చిరాకు, అసహనం పెరిగిపోతాయి. ఏకాగ్రత ఉండదు. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. రేడియేషన్ ప్రభావం వల్ల నరాల సమతుల్యత దెబ్బతిని, దీర్ఘకాలంలో బ్రెయిన్ ట్యూమర్లు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత ప్రవర్థనలోనూ మార్పు వస్తుంది. ఇంట్లో వారిపైన, పనిచేసేచోట సహచర సిబ్బందిపైనా అరవడం చేస్తుంటారు. అసలు ఆహారం తీసుకోకపోవడం, లేదంటే ఎక్కువ ఆహారం తీసుకోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన సూచనలు పాటించాలి.
– ప్రీతి, మానసిక వైద్యురాలు
అధిక స్క్రీన్ టైమ్‌తో శారీరక, మానసిక సమస్యలు
పిల్లల్లో చదువు, శారీరక ఎదుగుదలపై ప్రభావం
పెద్దల్లో మెడ నరాలు, జీవనశైలి వ్యాధులకు బాట
అప్రమత్తతే అసలైన రక్షణంటున్న వైద్యులు


