దేవుడి పేరిట ఇసుక అక్రమ రవాణా హనుమాన్ ఆలయ అభివృద్ధి పేరిట రశీదులు ఆర్నెళ్లకుగాను రూ.10 లక్షల టెండర్ ఒక్కో ట్రిప్పుకు రూ.300 నుంచి రూ.500 వసూలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న మైనింగ్, రెవెన్యూ అధికారులు
ఇటిక్యాల వాగులోంచి ఇసుక అక్రమ రవాణా
రాయికల్: రాయికల్ మండలం ఇటిక్యాలలోని పెద్ద వాగు నుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. గ్రామంలోని హనుమాన్ ఆలయ అభివృద్ధి పేరిట కొంత మంది ఆర్నెళ్ల కాల వ్యవధికి రూ.10 లక్షల టెండర్‌ను దక్కించుకున్నారు. అప్పటినుంచి ఎవరికీ అనుమానం రాకుండా హనుమాన్ ఆలయ అభివృద్ధి అంటూ దేవుని పేరిట రశీదులు తయారుచేయించి ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ఇందుకోసం వాగు శివారులో.. పరిసర ప్రాంతాల్లో ట్రాక్టర్ డ్రైవర్లకు చిట్టీ అందిస్తున్నారు. ఒక్కో చిట్టీకి అదే గ్రామానికి ఇసుక అయితే రూ.300, ఇతర గ్రామాలకు తరలిస్తే రూ.500 వసూలు చేస్తున్నారు. ప్రకృతి సంపద అయిన ఇసుకను హనుమాన్ ఆలయ అభివృద్ధి పేరిట రశీదులు తయారు చేసి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.300 నుంచి రూ.500 వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇదంతా తెలిసినా రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
రాయికల్ నుంచి మెట్పల్లి వరకు తరలింపు
ఇసుకకు డిమాండ్ ఉండటంతో మల్లాపూర్ మండలం సాతారం, కోరుట్ల మండలం పైడిమడుగు, మెట్పల్లి పట్టణంతోపాటు, పరిసర గ్రామాల నుంచి ట్రాక్టర్లు ఇటిక్యాలలోని పెద్దవాగు నుంచి ఇసుకను తీసుకెళ్తున్నాయి. ఒక్కో ట్రిప్పుకు సుమారు రూ.2500 నుంచి ప్రాంతాలను బట్టి రూ.3500 వరకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతిరోజు సుమారు 50 నుంచి 100 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.
చూసీచూడనట్లుగా మైనింగ్ అధికారులు
పెద్దవాగు నుంచి భారీ ఎత్తున ఇసుక రవాణా అవుతున్నా.. రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక ట్రాక్టర్లను ఎవరైనా అడ్డుకుని ప్రశ్నిస్తే.. సంబంధిత అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పినట్లు బహిరంగంగానే చెబుతుండడం గమనార్హం. అనుమతి లేకుండా.. కేవలం ఆలయ అభివృద్ధి కోసమంటూ ఇసుకను తరలిస్తున్న వారితోపాటు ఇందుకు సహకరిస్తున్న సంబంధిత శాఖల అధికారులపై గ్రామస్తులు, పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని కోరుతున్నారు.
అక్రమంగా రవాణా చేస్తే చర్యలు
అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుకను ఇళ్ల నిర్మాణాలకు తరలించాలి. వీఆర్ఏలు, జీపీవోలు ఎప్పటికప్పుడు ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటున్నారు.
– నాగార్జున, తహసీల్దార్,
రాయికల్


