ప్రక్షాళన షురూ..! | - | Sakshi
Sakshi News home page

ప్రక్షాళన షురూ..!

Aug 30 2026 12:09 AM | Updated on Aug 30 2026 12:09 AM

పకడ్బందీగా కొనసాగుతున్న సర్వే విధుల్లో నిర్లక్ష్యం చేస్తే వేటే ఇప్పటికే తహసీల్దార్‌ సస్పెన్షన్‌ మరొకరికి మెమో ఒక్కో రైతుకు ఒక్కో భూదార్‌

జగిత్యాల: జిల్లాలో కొనసాగుతున్న భూ రీసర్వే.. ఇందులో భాగస్వామ్యం అవుతున్న ఉద్యోగులు, సిబ్బంది ప్రక్షాళన మొదలైంది. ఇటీవల జిల్లాలో పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించి నాలుగు గంటలపైగా రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. భూ రీసర్వే, 22ఏ కేసులు, భూభారతి దరఖాస్తులపై పూర్తిస్థాయిలో సమీక్షించారు. ఒక్కో మండలానికి చెందిన తహసీల్దార్లను అరగంటకుపైగా భూ సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యం వహించిన ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌పై వేటు వేశారు. అలాగే మరొకరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఫలితంగా ఉద్యోగులు, సిబ్బంది భూభారతి పనులు, భూరీసర్వే, 22ఏ పనులు పకడ్బందీగా చేపడుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేస్తున్నారు.

మంత్రి సమీక్ష అనంతరం భూ సమస్యలపై కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి మండలంలో పర్యటిస్తూ.. ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నారో స్వయంగా తెలుసుకుంటున్నారు. భూభారతి, భూ రీసర్వేపై నిర్లక్ష్యం వహిస్తున్నారని గుర్తించి ఇటీవలే మెట్‌పల్లి తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేశారు. భూరికార్డుల పరిశీలన, రీసర్వే, ఇందిరమ్మ గృహ నిర్మాణాలపై జాప్యం చేయొద్దని చెబుతన్నారు. అధికారులపైనే వేటు పడుతుండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై పకడ్బందీగా పనులు చేపడుతున్నారు.

ప్రతిరోజు 40 ఎకరాల భూమి రీసర్వే..

భూభారతి చట్టాన్ని పకడ్బందీగా చేపట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సంబంధించిన ఎంజాయ్‌మెంట్‌ సర్వే నిర్వహించి రైతులకు భూదార్‌ నంబర్లను కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద బీర్‌పూర్‌ మండలం కోమన్‌పల్లిలో సర్వే చేపట్టి మ్యాప్‌ రూపొందించి సర్వే నంబర్ల వారీగా సర్వే జరిపి హద్దులు ఖరారు చేసి వాటికి ల్యాండ్‌ పార్ట్‌ మ్యాప్‌ (ఎల్పీఎం) రూపొందించి ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. మరో 70 గ్రామాలను ఎంపిక చేయగా.. సర్వే కొనసాగుతోంది. భూ వివరాలు, అక్షాంశ, రేఖాంశాలు పొందుపర్చుతారు. ఒక గ్రామంలో ఒక రైతుకు ఉన్న వివిధ సర్వేనంబర్లలో ఉన్న సాగు భూములను పట్టాదారు పాస్‌బుక్‌ ఆధారంగా ఒక చోటుకు చేర్చి భూదార్‌ నంబరు కేటాయించనున్నారు.

వివాదాలకు తెర

ఎంజాయ్‌మెంట్‌ సర్వే ద్వారా భూవివాదాలు లేకుండా ఉంటాయి. హద్దులు, మ్యాప్‌లు ఏర్పాటు చేస్తారు. దీంతో విక్రయించినా ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా హద్దుల విషయాల్లో గొడవలు జరుగుతుంటాయి. వాటిని సరి చేయడంతో పాటు, ప్రతి ఒక్క రైతుకు భూదార్‌ నంబరు ఇవ్వనుండటంతో కొంత వివాదాలకు తెర పడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement