‘భయో’వేస్టేజ్‌ | - | Sakshi
Sakshi News home page

‘భయో’వేస్టేజ్‌

Aug 30 2026 11:38 PM | Updated on Aug 30 2026 11:38 PM

మున్సిపల్‌ చెత్తలో పడేస్తున్న ఆస్పత్రుల నిర్వాహకులు అటు కార్మికులు, ఇటు ప్రజలకు పొంచి ఉన్న వ్యాధులు పట్టింపు లేని అధికారులు

భయో వేస్టేజ్‌

జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రి నిర్వాహకులు మున్సిపల్‌ చెత్త వాహనం రాగానే బయోమెడికల్‌ వేస్టేజీ అందిస్తున్నారు. విషయాన్ని స్తానికులు గుర్తించి నిలదీయడంతో వేయడం లేదని మాటమార్చారు.

నాలుగు రోజుల క్రితం.. జిల్లాకేంద్రంలోని మోతె రోడ్‌లో ఓ డ్రైనేజీలో ఏకంగా బయోమెడికల్‌ వేస్టేజీని పడేశారు. దానిని మున్సిపల్‌ కార్మికులు తీసుకుని చెత్త ట్రాక్టర్‌లో తరలించారు. విషయం బయటకు రావడంతో మున్సిపల్‌ అధికారులు వేస్టేజీ పడేసిన వారికి రూ.10వేల జరిమానా విధించి సరిపుచ్చారు.

బల్దియా చెత్త ట్రాక్టర్‌లో వేస్తున్న మెడికల్‌ వేస్ట్‌

జగిత్యాల: పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని అధికారులు చెబుతుంటారు. కానీ అమలులో, ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా జిల్లాకేంద్రంలో మాత్రం అది ముందుకు కదలడం లేదు. పర్యావరణానికి హాని కలిగించే బయోమెడికల్‌ వేస్ట్‌ ఇష్టానుసారంగా పడేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు సుమారు 200పైగా ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో మొత్తం చెత్త రోజుకు సుమారు 80 మెట్రిక్‌ టన్నుల వరకు వస్తుంది. ఇందులో దాదాపు ఒకటి నుంచి రెండు టన్నుల బయో మెడికల్‌ వేస్ట్‌ ఉంటుంది. నిబంధనల ప్రకారం ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రులు మున్సిపాలిటీ చెత్తలోగానీ, ట్రాక్టర్లలోగానీ వేయకూడదు. వాటిని సపరేట్‌ చేసి పడేయాల్సి ఉంటుంది. ఈ వేస్టేజీని సేకరించేందుకు కరీంనగర్‌కు చెందిన వెంకటరమణ ఇన్సులేటర్‌ అనే ఏజెన్సీతో ఒప్పందం ఉంది. వారే వచ్చి ఆస్పత్రుల వేస్ట్‌ను తీసుకెళ్తుంటారు. ఆ వాహనంలోనే ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రుల వేస్ట్‌ను వేయాల్సి ఉంటుంది. కానీ దీనిని ఎవరూ పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీ వారు కూడా ప్రతిరోజు వాహనంలో వచ్చి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొందరు ఈ ఏజెన్సీ వారికి డబ్బులు చెల్లించాల్సి వస్తుందనే దుర్భుద్దితో మున్సిపల్‌ వాహనాల్లో లేదా బయట డ్రైనేజీల్లో వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏజెన్సీ వారు ఇన్సులేటర్‌ వాహనంలో బయోమెడికల్‌ వేస్ట్‌ను తీసుకెళ్లి కరిగించేస్తారు. జిల్లాలో ఉన్న డంపింగ్‌యార్డులో కార్మికులు చెత్తను కాలబెడుతున్నారు. అయితే బయోమెడికల్‌ వేస్ట్‌ కాలుష్యమై పలు రోగాలకు దారితీస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కాలబెట్టినప్పుడు దుర్గంధం చుట్టూరా రెండు కిలోమీటర్ల వరకు వస్తోందని ప్రజలు పేర్కొంటున్నారు.

బయోమెడికల్‌ వేస్ట్‌ డేంజర్‌

ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిత్యం సిరంజీలు, కాటన్‌ దూదులు, సైలెన్లు తదితర సర్జికల్‌ వస్తువులను వివిధ వ్యాధులతో వచ్చిన వారికి వినియోగిస్తుంటారు. బయట డ్రైనేజీలు, మున్సిపల్‌ చెత్త వాహనాల్లోనే వేయడంతో మున్సిపల్‌ కార్మికులు తీసే సమయంలో సిరంజీలు గానీ, ఇతర వస్తువులు వారికి అంటుకున్న రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన సిరంజీలు ఉంటే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. డీఎంహెచ్‌వోతో పాటు పొల్యుషన్‌ కంట్రోల్‌బోర్డు అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేసి బయోమెడికల్‌ వేస్ట్‌ను కచ్చితంగా ఇన్సులేటర్‌ వాహనాలకే తరలించాలని, బల్దియాకు సంబంధించిన వేస్ట్‌లో వేయకూడదని పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement