కథలాపూర్(వేములవాడ): అంగన్‌వాడీకేంద్రాలకు విద్యుత్ సౌకర్యం లేక టీచర్లు, చిన్నారులు ఇబ్బందిపడుతున్నారు. గదుల్లో గాలి, వెలుతురు సరిగా లేక అసౌకర్యానికి గురయ్యారు. వేసవి వచ్చిందంటే పరిస్థితి మరీ అధ్వానంగా ఉండేది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించాలని నిర్ణయించింది. ట్రాన్స్‌కో అధికారుల సూచనల మేరకు సిబ్బంది మీటర్ల బిగింపు పనుల్లో నిమగ్నమయ్యారు.
429 కేంద్రాలకు ఉచిత కనెక్షన్లు
జిల్లాలో 1,065 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 278 కేంద్రాలు సొంత భవనంలో.. 246 కేంద్రాలు అద్దె చెల్లించాల్సిన అవసరంలేని భవనాల్లో నిర్వహిస్తున్నారు. మిగిలిన 541 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇందులో ప్రభుత్వ భవనాలు ఉన్న కేంద్రాల్లో మీటర్లు బిగించేందుకు అధికారులు నిర్ణయించారు. వీటిలో కొన్ని శిథిలావస్థలో ఉన్న వాటిని మినహాయించి 429 కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి మీటర్లు బిగించారు. కేవలం కనెక్షన్ ఇస్తే సరిపోదని, ఫ్యాన్లు, బల్బులు, ఇతర అవసరాలకు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే బాగుంటుందని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యుత్ సౌకర్యం అందుబాటులోకొస్తే ఇన్నాళ్లు ఇబ్బంది పడిన టీచర్లు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మేలు జరుగుతుందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


