అద్దె భవనంలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 4 కిలోమీటర్ల దూరంలో నిర్మించేందుకు అధికారుల నిర్ణయం అందుబాటులో ఎకరం స్థలం లేదంటూ బుకాయింపు అంతదూరంలో నిర్మిస్తే ఇబ్బందులు తప్పవంటున్న ప్రజలు
ఊరికి దూరం..
వరదకాలువ సమీపంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కేటాయించిన స్థలం
అద్దె భవనంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం
మల్యాల: మండల కేంద్రంలో ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సొంత భవనం నిర్మించేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయాన్ని ఊరవతలా.. అది కూడా నాలుగు కిలోమీటర్ల దూరంలో నిర్మించేందుకు సిద్ధమవుతుండడమే కారణం. మండల కేంద్రంలోనే స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ నాలుగుకిలోమీటర్ల దూరంలో ఉన్న వరదకాలువ సమీపంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మించాలని నిర్ణయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మల్యాల పంచాయతీ సమితి కేంద్రంగా ఉన్నప్పుడే మండల పరిషత్ కార్యాలయానికి స్థలం కేటాయించారు. ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయం, విద్యావనరుల కేంద్రం, వ్యవసాయాధికారి కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువైద్య శాల, పోలీస్‌స్టేషన్, సర్కిల్ కార్యాలయం, సెర్ప్ కార్యాలయం, మహిళా సమాఖ్య భవనం, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయం, గెస్ట్ హౌస్, యునానీ ఆస్పత్రి, సింగిల్ విండో కార్యాలయం ఇలా అన్నీ ఒకేచోట ఉన్నాయి. ఇక్కడ ఉన్న వ్యవసాయ ఏడీఏ కార్యాలయాన్ని గంగాధర మండలానికి తరలించారు. ఐసీడీఎస్ కార్యాలయం కోసం విద్యావనరుల కేంద్రం ఎదుట స్థలం కేటాయించగా.. పిల్లర్ల వరకు పనులు పూర్తయ్యాయి. రెండేళ్ల క్రితం సింగిల్ విండోకు అదనంగా మహిళా సంఘం భవనాన్ని అప్పగించారు. పల్లె ప్రకృతి వనం కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న వ్యవసాయ గోదాంలో ఇండోర్ స్టేడియం, క్రీడాప్రాంగణం, రైతు వేదిక నిర్మించారు.
అంతదూరంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
వాస్తవానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. అయితే కార్యాలయం నిర్మాణానికి ఎకరం స్థలం కావాలన్న నిబంధనల పేరిట నాలుగు కిలోమీటర్ల దూరంలో నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండడం గమనార్హం. ప్రస్తుతం రెండు గదుల అద్దె భవనంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కొనసాగుతోంది.
అందుబాటులో స్థలం ఉన్నా..
మండల పరిషత్ స్థలంలో అన్ని కార్యాలయాలు పోను ఇంకా రెండెకరాలకు పైగా స్థలం అందుబాటులో ఉంది. వ్యవసాయ కార్యాలయం, సెర్ప్ కార్యాలయం ఎదుట స్థలం ఉంది. అయితే వ్యవసాయ కార్యాలయం స్థలంలో ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయం నిర్మాణానికి అధికారులు అనుమతి ఇచ్చారు.
అధికారుల ఇష్టారాజ్యం.. ప్రజలకు ఇక్కట్లు..
వాస్తవానికి రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రజలందరితో ముడిపడి ఉంటుంది. అదే ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయానికి అధికారులు కలెక్షన్ కోసం.. అసాధారణ బిల్లుల విషయంలో మాత్రమే వినియోగదారులు వెళ్తారు. ఈ కార్యాలయానికి సబ్‌స్టేషన్ వద్ద స్థలం కూడా అందుబాటులోనే ఉంది. పైగా ఆ స్థలాన్ని ముందుగా ప్రతిపాదన చేశారు కూడా. అంతలోనే ఏమైందో తెలియదుగానీ.. ఇప్పుడు పరిషత్ స్థలంలోనే ఈఆర్‌ఓ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణానికి రూ.1.40కోట్లు మంజూరుకాగా.. ఎకరం స్థలం లేదంటూ వరదకాలువ వద్ద ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించడం అధికారుల అనాలోచిత విధానానికి అద్దం పడుతోంది.


