పిక్కలు పీకుతున్నాయ్‌ | - | Sakshi
Sakshi News home page

పిక్కలు పీకుతున్నాయ్‌

Aug 30 2026 11:38 PM | Updated on Aug 30 2026 11:38 PM

● గుంపుగుంపులుగా కుక్కల సంచారం ● వృద్ధులు, పిల్లలపై వరుసదాడులు ● భయంతో వణుకుతున్న ప్రజలు ● ఈ ఏడాది 2,950 మందికి గాయాలు

జిల్లాలో కుక్కల దాడిలో గాయపడిన బాధితులు

గొల్లపల్లి: జిల్లావ్యాప్తంగా వీధికుక్కల బెడద తీవ్రరూపం దాల్చింది. నిత్యం ఎక్కడోచోట ప్రజలపై దాడులు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసినా.. అనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ నిబంధనలు క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. జంతు ప్రేమకంటే మానవ ప్రాణమే మిన్న అని, ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రజల రక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసినా జిల్లాలో మాత్రం అధికారులు కాగితాలకే పరిమితం చేశారు.

పట్టించుకోని యంత్రాంగం

కుక్కల బెడద 20 మండలాలు, 385 గ్రామ పంచాయతీలు, ఐదు మున్సిపాలిటీల్లో తీవ్రంగా మారింది. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు 2,950 పైచిలుకు మంది కుక్కల దాడిలో గాయపడ్డారు. జిల్లాకేంద్రంలో కుక్కలకు శస్త్రచికిత్స చేసే ఏబీసీ కేంద్రం ఉన్నప్పటికీ.. ఒక్కో శునకానికి రూ.1,600 ఖర్చు అవుతుందనే నెపంతో పక్కన పడేయడం గమనార్హం.

కొరవడిన వ్యాక్సిన్లు, అవగాహన

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగినంత స్థాయిలో యాంటీరేబిస్‌ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు. బడికి వెళ్లిన పిల్లలు క్షేమంగా తిరిగొస్తారో లేదోనని తల్లిదండ్రులు వణికిపోతున్నారు.

చర్యలు తీసుకుంటేనే..

కలెక్టర్‌, పంచాయతీ, మున్సిపల్‌ అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు. వీధికుక్కలను పట్టుకుని స్టెరిలైజేషన్‌ కేంద్రాలకు తరలించాలని, ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ల కొరత తీర్చి, ఆత్మకూర్‌, కోటిలింగాల వంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

కన్నీటి గాథలు.. మారని తీరు

గతంలో గొల్లపల్లి మండలం ఆత్మకూర్‌ గ్రామానికి చెందిన 12ఏళ్ల బాలిక సంగెపు సాహిత్య పిచ్చికుక్క దాడిలో ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన జిల్లా ప్రజలను ఇప్పటికీ భయాందోళనకు గురిచేస్తోంది.

కోటిలింగాల (వెల్గటూర్‌ మండలం)కు చెందిన 8 ఏళ్ల బాలుడు మణితేజపై కుక్క దాడి చేసింది. అతడిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు. దాదాపు 15 నెలలపాటు రూ.50లక్షలకుపైగా ఖర్చు చేసి చికిత్స అందించినా రేబీస్‌ లక్షణాలు తిరగబెట్టి కన్నుమూశాడు.

తుంగూర్‌ (బీర్పూర్‌) గ్రామానికి చెందిన 4 ఏళ్ల రక్షిత్‌ కూడా ఆడుకుంటుండగా కుక్కదాడికి గురై సకాలంలో సరైన వైద్యం అందక ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు.

సారంగాపూర్‌ మండలంలో ఒక్కరోజే 11 మంది పిచ్చికుక్క దాడులకు గురై ఆస్పత్రి పాలయ్యారు.

ఏడాది బాధితులు

2024 4100

2025 7100

2026(జూలై వరకు) 2,950

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

ఆర్టికల్‌ 21 ప్రకారం పౌరులకు సురక్షిత సమాజంలో జీవించే హక్కు ఉంది. జంతు సంక్షేమ చట్టాల కంటే పౌరుల ప్రాణాలకే తొలి ప్రాధాన్యం.

రేబీస్‌ బారిన పడిన, తీవ్రంగా గాయపడిన, ప్రమాదకరంగా మారిన కుక్కలకు వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో ప్రశాంత మరణం అందించవచ్చు.

పాఠశాలలు, ఆసుపత్రులు, బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్ల సమీపంలో పట్టుకున్న కుక్కలకు స్టెరిలైజేషన్‌ చేశాక మళ్లీ అవే ప్రాంతాల్లో విడిచిపెట్టకూడదు.

ప్రతి జిల్లాలో జంతు సంతాన నిరోధక శస్త్రచి కిత్స కేంద్రాలను తప్పనిసరిగా నిర్వహించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement